కశ్మీర్ లో ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రప్రభుత్వం….

jammu and kashmir division bill to move lok sabha
Share Icons:

 

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లో 144 సెక్షని విధించి, పలు రాజకీయ నేతలనీ గృహ నిర్బంధం చేసి…కేంద్ర బలగాలని మోహరించి పలు ఆంక్షలు పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూ కశ్మీర్‌లో విధించిన ఆంక్షలన్నింటినీ తొలగిస్తూ, ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల అధికారుల నుంచి ఓ ప్రకటన వెలువడింది.

రాష్ట్రంలోని ల్యాండ్‌లైన్ ఫోన్లను పూర్తి వినియోగంలోకి తెచ్చామని, అత్యంత సున్నితమైన కుప్వారా, హంద్వారా తదితర ప్రాంతాల్లోనూ మొబైల్ ఫోన్ నెట్‌ వర్క్‌ లను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. అలాగే ట్రాఫిక్ రద్దీ క్రమంగా పెరుగుతోందని, వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వాడకం కూడా పెరిగిందని ఓ అధికారి వెల్లడించారు. ఎక్కడా అల్లర్లు జరగకపోవడంతో, తొలుత కర్ఫ్యూను తొలగించిన అధికారులు, ఇప్పుడు ఫోన్ నెట్ వర్క్ నూ అందుబాటులోకి తెచ్చారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ మాత్రం అమలులో ఉంది. విధుల్లో ఉన్న సైనిక బలగాలను సైతం క్రమంగా వెనక్కు తీసుకుంటున్నామని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఇండో అమెరికన్ కాంగ్రెస్ నేతలు ప్రమీల జయపాల్, జేమ్స్ పీ మెక్ గవర్న్ లు కశ్మీర్ పై జోక్యం చేసుకోవాలని కోరుతూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపేకు లేఖ రాశారు. గృహ నిర్బంధంలో ఉన్న నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా కశ్మీర్ లో పరిస్తితి సమీక్షించేందుకు అంతర్జాతీయ మీడియాని, మానవ హక్కుల సంఘాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే కశ్మీర్ లో వెంటనే ఆసుపత్రులని తెరిపించాలని, లేదంటే ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పారు. దయచేసి ఈ విషయాలపై మానవత్వంతో స్పందించి, కశ్మీర్ లోయలో మానవ హక్కులను కాపాడాలని అమెరికా విదేశాంగ మంత్రిని కోరారు. అయితే ఈ లేఖ రాసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లో ఆంక్షలు ఎత్తివేయడం గమనార్హం.

 

Leave a Reply