భాషపై మౌనం -‘నంది’పై చిందులు

Share Icons:

గత రెండు వారాలుగా ఆంధ్ర రాష్ట్రంలో  ప్రధానంగా రెండు  సమస్యలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేశాయి. అందులో ఒకటి , తెలుగు మాతృబాషా పరిరక్షణ  ఉద్యమ నాయకులు తెలుగు దండు పేరుతో విశాఖపట్నం లో  20 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షలు. రెండవది,  నంది అవార్డులుపై .కొనసాగుతున్నవివాదం . విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పరవస్తు ఫణిశయన సూరి చేపట్టిన దీక్ష వేలాదిమంది తెలుగు మాతృబాషాభిమానుల్ని ఆకట్టుకుని వారి మద్దతును పొందగలుగుతున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మాత్రం కదిలించలేకపోయింది.  ఆయన చుట్టూ నిరంతరం వుండే తెలుగు అకాడెమీ, అధికార భాష సంఘం , ప్రెస్ అకాడెమీ , తెలుగు గురించి వేదికలమీద ఎంతో  చక్కగా వుపన్యాసలిచ్చే నాయకులు మంత్రులు కూడా దీని గురించి స్పందించే సాహసం చేయటం లేదు. ప్రైవేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న దురదృష్ట కరమైన  ఆత్మ హత్యల సంఘటనలు , ఫీజుల రూపంలో జరుగుతున్న దోపిడీలు మానవహక్కుల కమిటీకి నివేదించవలసినంత తీవ్ర స్థాయిలో ఉన్నా ,ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు.  పైగా , మున్సిపల్ స్కూళ్ళలో , అంగన్ వాడీలలో కూడా తెలుగు కు బదులు ఇంగ్లీష్  ను బోధన బాషగా ప్రవేశపెట్టే ప్రక్రియ చాప కింద నీరు లాగా మొదలవుతోంది.  అంటే , ఇప్పటికే ప్రైవేట్ ఇంగ్లీష్ స్కూళ్ళ పుణ్యమా  అని తెలుగు మరిచిపోతున్న యీ తరం తరువాత తరానికి ,  తమ మాతృబాష  చరిత్రలో కలిసిపోయిన మృతబాషగానే పరిచయమవుతుంది.  పైగా,  అంగన్ వాడీలలో పిల్లలకి ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ నేర్పే బాధ్యతను నారాయణ స్కూల్స్ తీసుకుంటాయట. ఇది అమరావతి నిర్మాణం రూప కల్పన బాధ్యతను రాజమౌళికి అప్పగించామని చెప్పినట్లుంది. (రాజమౌళికి ఆధార కార్డ్ ఎక్కడ వుందో మరి) మన సొంత రాష్ట్రంలోనే మన మాతృభాషపై ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు,  నిర్లక్ష్యం వుంటే  తమిళనాడు, కర్నాటక లాంటి ప్రవాస రాష్ట్రాలలో తెలుగు భాషను తొక్కెస్తున్నారని బాధపడటంలో అర్థం లేదు.  వాస్తవానికి ప్రజాస్వామ్య సర్వసత్తాక గణతంత్ర రాజ్యంలో ప్రతి పౌరుడికి తన మాతృబాషలో చదువుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది.  యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా కనీసం ప్రాథమిక విద్యవరకు మాతృభాషలో చదువుకునే అవకాశం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైవుందని నొక్కి చెప్పాయి. అయినా తెలుగులో చదువుకునే వారు  ఎందుకు పనికిరాకుండా పోతారని హెచ్చరించే ప్రబుద్ధులు మనకు మంత్రివర్యులుగా వున్నారు.  విశాఖలో దీక్షలకు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రముఖు లు మద్దతు  తెలుపుతున్నాప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు.

ఇక రెండవ అంశం. నంది అవార్డు పై వివాదానికి చిరాకెత్తి ముఖ్యమంత్రి ఏకంగా నందులనే ఎత్తివేస్తామని ప్రకటిచడం , హైదరాబాద్లో ఆధార్ కార్డ్ లు లేనివారు కూడా నంది  అవార్డులను విమర్శిస్తున్నారని ఆయన కుమారుడు ఐ టి మంత్రి  లోకేశ్ వ్యాఖ్యలు దీనిపై ప్రభుత్వానికి చాలామంది కులాలకు అతీతంగా దూరమయే పరిస్థితిని కల్పించాయి. నటుడు మోహన్ బాబు అసలు మహానటుడు ఎన్టీఆర్ కె నందులు దక్కని  నందుల విలువను ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారు. అలాగే పోసానికృష్ణ  మురళీ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ నంది అవార్డులపై ముఖ్యమంత్రి లోకేశ్ వ్యాఖ్యలను తనదైన శైలిలో ఉతికి ఆరేశారు. క్రమంగా నంది అవార్డులపై  తెలుగు చిత్రపరిశ్రమ రెండుగా చీలిపోయిన పరిస్థితి  ఏర్పడింది.  నందులను ఎత్తేసినా వుంచినా తెలుగుదేశం ప్రభుత్వం అవార్డుల ఎంపికలో జరిగినట్లు చెప్తున్న  అన్యాయా న్ని , అవకతవకలను సవరిస్తుందా లేదా పంతానికి  పోయిప్రజలు మరిచిపోయేటట్లు చేస్తుందా అనేది వేచిచూడాలి.

చీఫ్ ఎడిటర్ సూర్య ప్రకాశరావు

One Comment on “భాషపై మౌనం -‘నంది’పై చిందులు”

  1. టైటిల్ కాలమ్ నందు టైటిల్ లేకుండా ప్రచురితం అయింది.

Leave a Reply