Views:
7

తాండర్ లోని టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. పార్టీలో తనకు సరైన గుర్తింపు  లభించడం లేదంటూ ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరులో కలకలం సృష్టించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు కూడా దక్కడం లేదని తాండూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్  సమావేశంలో తన వాదనను వినిపించి కార్యకర్తల మధ్యలో కూర్చున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా పని చేసిన ఆయన రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని, మరెన్నో ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశానని అన్నారు.

 

ప్రత్యేక రాష్ట్రం సాధించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమలాంటి ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేదని ఆయూబ్‌ఖాన్‌ ఆవేదన చెందారు. ఉద్యమ కారులకు నామినేటెడ్‌ పదవులు కూడా ఇవ్వడం లేదని పార్టీలో కొత్తగా వచ్చిన వారికి పదవులు దక్కుతున్నాయని అన్నారు. ఈ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన తన ప్రసంగం ముగించి జనం మద్యలోకి వెళ్లిపోయారు. కొద్దిసేపు సమావేశంలో వింటూ కూర్చున్న ఆయన పక్కకు వెళ్లి తన వెంటతెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. కాలుతున్న మంటలతో సహా ఒక్కసారిగా జనం మద్దలోకి వచ్చారు.  మంటల ధాటికి తల, ఛాతి విపరీతంగా కాలిపోయాయి. వెంటనే అక్కడున్న కార్యకర్తలు, నాయకులు,  పోలీసులు మంటలను ఆర్పి ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌లో  హైదరాబాద్‌కు  తరలించారు.   హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో మంత్రి మహేందర్ రెడ్డితో పాటు అందరూ షాక్ కు గురయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *