type writing institute
Views:
87

ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని సామెత. కొమ్ములు ఎంత వాడి అయినా, చెవులు చేసే పని చెయ్యలేవు అని కూడా ఒక సామెతను మనకు మనమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామెతలు జనసామాన్యం నుండీ వచ్చినవే కాబట్టి, అవి కూడా ఎవరో రాసినవే కాబట్టి. ఇంతకీ ఈ చెవులు, కొమ్ముల గొడవ ఏమిటి అంటారా, సందర్భం అలాంటిది.

ఈ కొమ్ములెక్కడివి, చెవులేమిటి

ఇవాల్టి ప్రపంచమా కంప్యూటర్లూ, ట్యాబ్ లు, విశ్వదర్శనం చేయించే అరచేతి చిత్రాలైన స్మార్ట్ మోబైల్సు, వీటితో నిండి పోయి ఉంది. ఇది చెప్పడం వెనుక కూడా ఒక కారణం ఉంది. పూర్వం ఏదైనా అధికారిక పత్రం, అర్జీ లేదా దస్తావేజు రాయించాలంటే దస్తూరీ బహు చక్కగా ఉండి ఆంగ్లం కానీ తెలుగు కానీ భాషా పరిజ్ఞానం ఉన్నవారి దగ్గరకు పరుగెత్తేవారు. తర్వాత్తర్వాత టైపురైటర్లు వచ్చాయి. రెండు దశాబ్దాల క్రిందట టైపురైటర్లది వర్ణింపలేని వైభవం. ఎవరైనా టైపురైటింగ్ ట్రైనింగ్ కు వెళ్తున్నారు అంటే అదో రకమైన గౌరవ భావం చూసేవాళ్ళ కళ్ళలో ప్రస్ఫుటంగా కనిపించేది. అప్పటి జర్నలిస్టులకు, స్టెనోగ్రాఫర్లకు షార్ట్ హ్యాండ్ ట్రైనింగ్ కచ్చితంగా అవసరం అయ్యేది. అందుకు సరిపడా ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉండేవి. టైపు చెయ్యడం ఒక కళ. నిముషానికి ఇన్ని పదాలు అచ్చుతప్పులు లేకుండా టైపు మెషిన్ మీద కొట్టగలగడం ఒక తపస్సు, అదొక సాఫల్యం కూడా.

టైపురైటింగ్ ప్రాభవం

అవి అందమైన రోజులు. టైపు రైటింగ్ ఇన్స్టిట్యూట్ లోకి అడుగు పెట్టగానే ఏదో కొత్త ప్రపంచంలోకి అగుడుపెట్టిన అనుభూతి. వరుసగా ఒద్దికగా వేసిన చెక్క బల్లలు, వాటిపై చిన్న పెద్ద ఆకారాల్లో విచిత్రంగా కనిపించే టైపు రైటింగ్ మెషిన్ లు, టైపు రైటర్ బల్లల దగ్గర టైపింగ్ కు అనుకూలమైన ఎత్తులో వేసిన బెంచిలు, అప్పటికే నేర్చుకోవడానికి వచ్చినవాళ్ళు టైపు చేస్తుంటే వెలువడే టక టక శబ్దాలు, కొత్తగా వచ్చినవాళ్ళు సిలిండర్ పై పేపర్ అమర్చుకోవడానికి పడే పాట్లు, లీవర్ ఎంత బలంతో జరపాలో సైంటిస్టు లెవెల్లో ఆలోచించే కళ్ళద్దాల బుర్రలు, సన్నటి వేళ్ళు ఉన్నవాళ్ళు టైపు చేస్తుండగా కీ సందుల్లో వేళ్ళు ఇరుక్కోవడం, మార్జిన్ లిమిట్ అయిపోగానే టింగు టింగుమని గంటలు మోగుతుంటే ఈ శబ్దం ఎక్కడినుంచీ వస్తుందబ్బా అంటూ అయోమయంగా అటూ ఇటూ చూసే అమాయక ముఖాలూ, టైపు చేస్తున్నప్పుడు లయబద్ధంగా వినబడే ధ్వనిని వింటూ, చక్కగా సాగుతున్న సంగీతంలో అపశ్రుతి ఎక్కడ దొర్లుతుందా అంటూ సంగీతం శిక్షకుడిలా వేచి చూసే టైపు రైటింగ్ మాష్టారు, టైపు రైటర్ లో అక్షరాలు ముద్రణ అవడానికి అమర్చే ఇంకు రిబ్బను వాసనలు, ఆహా, ఆ దృశ్యాల్ని తలచుకుంటే మనసు నిండిపోతుంది. ఈ కాలం వాళ్లకు టైపు రైటర్ల ప్రాభవం, వాటి ప్రాముఖ్యత తెలియదు. అధునాతనమైన కంప్యూటర్ కీ బోర్డులపై రెండంటే రెండే వేళ్ళతో అలా కన్నూ మిన్నూ గానకుండా టైపు చేసుకుంటూ పోతారు.

అనుకోకుండా దొరికిన ఒక విచిత్రం

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఒక పదిహేనేళ్ళ కిందట టైపు రైటింగ్ ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉండేదో కచ్చితంగా అలాంటి ఒక ప్రదేశమే కనబడింది కాబట్టి.  ఒక చల్లటి ఆదివారం సాయంత్రం, స్టాంప్ పేపర్ దొరుకుతుంది అంటే తిరుపతి నగరంలోని రామాలయం, ఉత్తర మాడవీధికి వెళ్ళడం తటస్థించింది. అలా వెతుక్కుంటూ ఉండగా ఒక బోర్డు పై కళ్ళు పడటం, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆఫీసులోకి వెళ్ళడం అసంకల్పితంగా జరిగిపోయాయి. ఇన్స్టిట్యూట్ పేరు శ్రీ పద్మావతి టైపు రైటింగ్ ఇన్స్టిట్యూట్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ). ఒక అచ్చమైన టైపు రైటింగ్ మాస్టర్, ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ బీ. నిరంజన్ రెడ్డి తన సున్నితమైన గొంతుతో స్వాగతం పలికారు. పెద్ద హాల్ లో 25 టైపు రైటర్లను చూడగానే ఒక్క క్షణం కాలం సినిమా ఫక్కీలో గిర్రున ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. తేరుకుని చూస్తె మనసు నిండి పోయింది. గత కాలపు టైపు రైటర్ రాచఠీవి మళ్ళీ కళ్ళముందు సాక్షాత్కరించింది. పొరపాటున ఏదైనా టైపు రైటర్ల మ్యూజియంలోకి అడుగు పెట్టామా అన్నంత సంభ్రమం. ఆనందాశ్చర్యాలు ఏకమై విరులై పూచాయి.

typewriting institute

ఆ రాముడి సాక్షిగా

అలా శ్రీ పద్మావతీ టైపు రైటింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉండగా ఇన్స్టిట్యూట్ కు ఎదురుగా ఉన్న రామాలయం గుడి గంటలు వినిపించాయి. అప్పుడు హఠాత్తుగా ఒక విషయం స్పురించింది. పితృవాక్య పరిపాలన. తండ్రి మాటమీద అడవులకేగిన రాముడి లక్షణం గుర్తుకొచ్చింది. ఎప్పటినుంచీ ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా, తన తండ్రి మోహన్ రావు 1968 లో ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారని, తన తర్వాత దీనిని జాగ్రత్తగా చూసుకోమని కోరిన కోరిక మేరకు తాను ఆయన మాటను నెరవేర్చడం తన ధర్మంగా భావించి అదే పద్ధతిలో సంస్థను నడుపుతున్నానని చెప్పుకొచ్చారు నిరంజన్. ఆహా ఎంతటి నిబద్ధత. రామాయణం అసలు జరిగిందో లేదో, రాముడు ఉన్నాడో లేడో గానీ నిరంజన్ లో మాత్రం నిజమైన రాముడు కనిపించాడు. శ్రీ పద్మావతి టైపు రైటింగ్ ఇన్స్టిట్యూట్ గుడిలాగే కనిపించింది. పితృవాక్య పరిపాలన అనే గొప్ప లక్షణాన్ని కళ్ళముందు ప్రయోగాత్మకంగా సాక్షాత్కరింపజేసారు నిరంజన్.

వన్నె తగ్గని అందం టైపు రైటర్ సొంతం

ఇప్పటికీ ఆసక్తి ఉన్నవాళ్ళు టైపు రైటింగ్ నేర్చుకోవడానికి ఆసక్తిగా వస్తూనే ఉంటారని చెప్పారు నిరంజన్. 25 టైపు రైటర్ ల నిర్వహణ చూసుకోవాలంటే శక్తికి మించిన భారమే అయినా శిక్షణా కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారాయన. ఇప్పటికీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ చేయించుకోవడానికి టైపు రైటర్ డాక్యుమెంటేషన్ ఇష్టపడేవాళ్ళు అప్పుడప్పుడూ వస్తూ ఉంటారని కళ్ళలో మెరుపులతో చెప్పారాయన. కంప్యూటర్లలో నిముషాల్లో అయ్యే పనిని టైపు రైటర్ల మీద ఇప్పటికీ చేయించుకోవడం కాస్త విచిత్రంగా ఉన్నా ఆనందించాల్సిన విషయం. టైపు రైటర్ మీద ఒక దస్తావేజో, ఒక అర్జీనో, అధికారిక పత్రమో తయారు చేస్తే ఆ తృప్తి వేరు. ఇక చూడలేమేమో అనుకున్న వాతావరణం కళ్ళముందు అనుకోకుండా నిలిచింది. అదొక అలౌకికానందం, అలవిగాని ఆత్మతృప్తి. ఎడారిలో మంచినీటి చెలమ లాంటి అందమైన జ్ఞాపకం.

టైపు రైటింగ్ ఆసక్తి ఉన్నవారు కింది చిరునామాను సంప్రదించవచ్చు.

బీ. నిరంజన్ రెడ్డి, ప్రిన్సిపాల్,

శ్రీ పద్మావతి టైపు రైటింగ్ ఇన్స్టిట్యూట్,

7-1-21, ఆర్.ఎన్.మాడ స్ట్రీట్,

తిరుపతి – 517507

మొబైల్: 9490182747, ఫోన్: 0877 – 2221294

ఈమెయిల్: bandiniranjanreddi@gmail.com

 

రచన: యజ్ఞపాల్ రాజు ఉపేంద్రం

8 thoughts on “కొమ్ములను జయించిన చెవులు”

 1. పై అరుదైన అనుభవం, ముచ్చటలో నేనూ భాగస్వామినై అచ్చరువొందిన వాడినే. ఈ వ్యాసకర్తను ఆ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడిని మన ‘మామాట’ కొరకు ఇంటర్వూ చేయమని కోరాను. యజ్ఞపాల్ రాజు సందర్భాన్ని, సన్నివేశాన్ని, మేమందరం పొందిన అపురూపమైన అనుభూతిని చక్కగా అక్షరీకరించాడు అనడంకంటే మనోనయనానందకరంగా చిత్రించాడు.

  పై ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు మంచి కూడలి ప్రాంతంలోని ఆ విశాలమైన హాల్ లో ఉన్న ఈ ప్రాణంలేని, ప్రాభవంలేని, ఆంతగా ఆదాయమూలేని ఆ టైపుమిషన్లను టోకుగా పాత ఇనుపసామాన్ల మండీలో పడేసి; చక్కగా పది కంప్యూటర్లతో నెట్ వర్క్ లేదా జాబ్ వర్క్ దుకాణం తెరిస్తే ఎంత లాభదాయకంగా ఉంటుందో అన్న విషయాన్ని మా ఇ.ఢి.గారు వివరించి నప్పుడు సదరు నిర్వాహకుడు ఇచ్చిన సమాధానం మా అందరినీ నిత్తర్వులను చేసింది. ఒకే మాట “తృప్తి ఉండదు కద సార్” అన్నాడు. ఓహ్హ్ఁ! రామ రామ అదెంత రామం రమ్యం! నిజమే తృప్తికి సాటిగా ఏ ఆదాయము సరికాదు కదా!

 2. ఆ టైపయ్యోరికి శతకోటి దండాలు మహాప్రభో! మా పిల్లకాయలు కొంచెం ఎదిగిరాంగానే అక్కడికే పంపిస్తాను సార్!

 3. “ఓహ్హ్ఁ! రామ రామ అదెంత రామం రమ్యం! నిజమే తృప్తికి సాటిగా ఏ ఆదాయము సరికాదు కదా!” -ఈ నిజాన్ని గ్రహించాలంటే, అలాగే ఆ అనుభూతిని అనుభవించాలంటే మీరంతా తప్పనిసరిగా ఈ చిరువ్యాసాన్ని మనసుతో చదవాలి… మనసారా చదవాలి.. -అవును చదివి తీరాలి…

 4. తండ్రి మాటకు, ఉన్నత విలువలకు కట్టుబడి లాభనష్టాలకు అతీతంగా ఇస్టిట్యూట్ ను నడుపుతున్న నిరంజన్ రెడ్డి నిజంగా అభినందనీయులు…

 5. మరచిపోయిన టైపు రైటర్ ను మరలా గుర్తుకు తెచ్చినందుకు అభినందనలు,ధన్యవాదాలు!

 6. Sir,
  Naku kuda net shop undi, business ledu, andukani type writing pettalani anu kunt unnaanu, type writer lu dorukutavaa, cheppagalaru, dorukutavaa ante tirupathi vachi kalusthaanu . Uvrathnam 9390411069. Ongole.

  • మీరు మేము వ్యాసంలో ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారి నెంబర్లను సంప్రదించండి. వారు మీకు సహకరించగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *