Views:
5

దక్షిణాది రాష్ట్రాలంతటా టమోటా దిగుబడులు తగ్గడంతో నెల రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ప్రస్తుతం తారా స్థాయికి చేరాయి. దేశంలోనే పెద్ద టమోటా మార్కెట్‌ అయిన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సోమవారం మొదటి రకం ధర కిలో రూ.50 నుంచి రూ.70 వరకు పలికింది. ఇది చిల్లర మార్కెట్‌లోకి వచ్చే సరికి రూ.80కి మించుతోంది. వాతావరణ పరిస్థితులు, చిత్తూరు జిల్లాలో వర్షపాతం లోటు, బయటి రాష్ట్రాల నుంచి దిగుబడులు రాకపోవడం ఇవన్నీ టమోటా ధర పెరగడానికి దోహదపడ్డాయి. వచ్చే రెండు నెలలూ ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.మదనపల్లె మార్కెట్‌కు గత సంవత్సరం ఇదే నెల మొదటి పది రోజుల్లో 69,980 టన్నుల సరకు వచ్చింది. ఈ నెల మొదటి పది రోజుల్లో వచ్చిన సరకు 28,240 టన్నులు మాత్రమే. గతేడాదితో పోల్చితే.. 41,740 టన్నుల దిగుబడి తగ్గింది. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌ 20 నుంచే టమోటా దిగుబడి తగ్గుముఖం పట్టింది. గతేడాది జూన్‌లో ఈ మార్కెట్‌కు రోజూ సగటున 5 వేల టన్నుల సరకు రాగా.. ఈసారి 4 వేల టన్నులకు తగ్గింది. జూన్‌ 10న కేవలం 2,400 టన్నులు మాత్రమే వచ్చింది.

ప్రతి ఏడాది జూన్‌, జులై నెలల్లో కర్ణాటకలోని చింతామణి, వడ్డిపల్లె తదితర ప్రాంతాల నుంచి మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 10 లారీల టమోటా వచ్చేది. ఈ సారి కర్ణాటక నుంచి ఒక్క కాయా రాలేదు.ఏటా ఈ సీజన్‌లో మదనపల్లె, చిత్తూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 60 వేల హెక్టార్లలో టమోటా సాగవుతోంది. ప్రస్తుతం 10 వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగులో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి నైరుతి రుతుపవన వర్షాలు ఆశించినస్థాయిలో కురవలేదు. లెక్కల్లో సాధారణ వర్షపాతం కనిపిస్తున్నా.. భూగర్భ జలాలు వృద్ధి చెందే స్థాయిలో భారీ వర్షాలు, ముసుర్లు, తుపాన్లు లేవు. బోర్లలో నీటిమట్టం పెరగకపోగా పడిపోయింది.ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కొత్తగా పంట వేయడానికి అవకాశం లేదు. ఒకట్రెండు భారీ వర్షాలు కురిస్తే తప్ప సాగు కష్టమే. పంట వేసిన 60-70 రోజుల్లో మొదటి కాపు వస్తుంది. ఈ లెక్కన ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కూడా ఇదే కొరత కొనసాగే అవకాశం ఉంది. బయటి రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగకపోతే.. అప్పటి వరకు ధరలు తగ్గకపోయినా ఆచ్చర్యపడనక్కర్లేదు.

మూలం : ఈనాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *