Views:
21

ఎవరినయినా అనుమానించవచ్చు  కాని  అమ్మని అనుమానించకూడదు అన్నది నానుడి. ఆడవాళ్ళల్లో చెడ్డ కూతురు, చెడ్డ బార్య, చెడ్డ సోదరి ఉంటుంది కాని చెడ్డ తల్లి ఉండదు అంటారు. కాని ఇక్కడ ఆరేళ్ళ పసి కూనని పొట్టన పెట్టుకుంది ఓ కసాయి సవితి తల్లి. పసిపిల్లల్ని చంపడానికి చేతులెలా వస్తాయో మాతృత్వపు మమకారాన్ని ఎలా మర్చిపోతారో.. ఈ ఘాతుకాన్ని చదివితే మనసు చలించక మానదు.

అభంశుభం ఎరుగని ఆరేళ్ల పాపను పొట్టనపెట్టుకుందో 30 ఏళ్ల కసాయి మహిళ. మద్దులొలికే పాపను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి గొంతు కోసి చంపేసిందామె. సౌదీలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. రీమ్ అల్ రషీదీ అనే ఆరేళ్ల పాప అల్ అహ్‌సాలోని ఓ స్కూల్‌లో చదువుకుంటోంది. సోమవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఆ పాప స్కూల్‌లో ఉండగా ఆమె పినతల్లి వచ్చింది. పాపను వెంటనే ఇంటికి తీసుకెళ్లాలని స్కూలు యాజమాన్యానికి చెప్పింది. తాను ఆ పాపకు తల్లినని చెబుతూ పాప, భర్తతో కలిసి దిగిన ఫోటోను యాజమాన్యానికి చూపింది. దీంతో సొంతతల్లే అని నమ్మి.. పాపను ఆమెకు ఇచ్చి పంపించారు. తల్లితో కలిసి ఇంటికి వెళ్తున్నానని సంబర పడిన ఆ రీమ్‌కు.. ఆ ఆనందం ఎంతో సేపు ఉండలేదు. 9 గంటల ప్రాంతంలో ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో గొంతుకోసింది. వదిలేయమని ప్రాధేయపడుతున్నా వినలేదు. నోరు మూసి కత్తతో పీక కోసి,  ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఈ దారుణ సంఘటనను కళ్లారా చూసిన ఓ పౌరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ఆమెను వెంబడిస్తూ ఆమె ఇంటివరకూ వెళ్లాడు. పోలీసులకు ఆ ఇంటిని చూపాడు. రక్తపు మరకలు ఉన్న కత్తిని కడుగుతున్న ఆమెను పోలీసులు పట్టుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం విచారణ జరగుతోంది. ఏ కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడిందనే విషయాన్ని ఆరాతీస్తున్నారు.

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *