Views:
15

వార్త

శశికళోపాఖ్యానం

నిజమేనండి తమిళనాట ఆమె మాట ప్రతినోట అట. ఇంతకీ వార్త ఏంటి అంటారా? తమిళనాడు ఎమ్మెల్యేల ‘విశ్వాసం’ చాలా ఖరీదైనదని తేలిపోయిందిట. తనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్‌ సెల్వాన్ని గద్దె దింపి తాను గద్దెనెక్కేందుకు చిన్నమ్మ శశికళ సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

చిన్నమ్మ ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌తో ఉబ్బితబ్బిబ్బయిన ఎమ్మెల్యేలు ఇళ్లు వాకిళ్లను.. పెళ్లాం బిడ్డలను.. తమను ఎన్నుకున్న ప్రజలను వదిలి ఏకంగా 15 రోజులు చెన్నై శివారులోని కూవత్తూరు రిసార్టులో కొలువుదీరారు.

తనకు అండగా నిలిచే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.6 కోట్లు ఇచ్చేందుకు చిన్నమ్మ అంగీకరించారని, పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీకి కటకట ఉండటంతో కొంత మొత్తాన్ని బంగారం రూపంలో ఇచ్చారని స్వయంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేనే వెల్లడించారు.

విశ్లేషణ: 

ఓ ఆంగ్ల, తమిళ చానళ్లు సంయుక్తంగా స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి చిన్నమ్మపై ఎమ్మెల్యేల ‘విశ్వాసం’ ఖరీదు ఎంతో నిగ్గుతేల్చాయి అని అభిజ్ఞ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే తొలుత శశికళ వర్గంలో ఉండి ఆ తర్వాత ఓపీఎస్‌ వర్గంలో చేరిన మదురై దక్షిణ ఎమ్మెల్యే శరవణన్‌ ఈ ‘స్టింగ్‌ ఆపరేషన్‌’లో నిక్కచ్చిగా వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే…
‘ఓపీఎస్‌ తిరుగుబావుటా ఎగురవేసినట్లు తేలిపోగానే అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలందరూ చెన్నైకి రావాలని శశికళ ఆదేశించారు. దూర ప్రాంతాల వారు విమానాల్లో, అవి అందుబాటులో లేనివారు రైలు, రోడ్డు మార్గాల్లో బయలుదేరారు. వీరందరికీ శశి వర్గం నుంచి ప్రత్యేక వాహనాలు ఎదురెళ్లాయి. ఆ వాహనాల్లోకి ఎక్కుతున్నప్పుడే తనకు అండగా నిలుస్తున్నందుకు చిన్నమ్మ రూ.2 కోట్లు ఇస్తారన్న హామీ లభించింది.
అనంతరం గవర్నర్‌ వద్దకు బలప్రదర్శనకు వెళ్లేటప్పుడు మరో రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.4 కోట్లు ఇస్తామన్నారు. గవర్నర్‌ నిర్ణయం వెలువడటంలో జాప్యం అవుతుండటంతో రేటు మరింత పెరిగింది. గవర్నర్‌ నిర్ణయం వెలువడే వరకు కూవత్తూరు రిసార్టులోనే ఉండేందుకుగాను మరో రూ.2 కోట్లు మొత్తం రూ.6 కోట్లు ఇస్తామని శశికళే స్వయంగా హామీ ఇచ్చారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా కరెన్సీ దొరకడం ఇబ్బందిగా ఉందని, అంత మొత్తం నగదు రూపంలో ఇవ్వలేమని, కొంత బంగారంగా ఇస్తామని శశికళ ఎమ్మెల్యేలకు సూచించారు. దానికి అందరూ అంగీకరించారు. దీంతో తన వర్గంలోకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ శశికళ హామీ ఇచ్చిన మొత్తాన్ని అందజేశారు.’ అని శరవణన్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో వివరించారు.
ఓపీఎస్‌ తక్కువేం కాదు..!
తనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలకు ఓపీఎస్‌ కూడా రూ.కోటి ఇచ్చినట్లు శరవణన్‌ తెలిపారు. ఓపీఎ్‌సకు బీజేపీ అండగా ఉన్నట్లు పేర్కొన్న శరవణన్‌.. భవిష్యత్తులో తాను రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మంత్రిని కావడం ఖాయమని వ్యాఖ్యానించడం స్టింగ్‌ ఆపరేషన్‌లో కొసమెరుపు.
అదంతా కుట్ర: అన్నాడీఎంకే
శశికళ తనకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారని పేర్కొంటూ జరిగిన స్టింగ్‌ ఆపరేషన్‌ బూటకమని అధికార అన్నాడీఎంకే కొట్టివేసింది. ఆ స్టింగ్‌ ఆపరేషన్‌లో ఆరోపణలు అన్నీ ఓపీఎస్‌ వర్గం కుట్రలో భాగమని పేర్కొంది. శశికళ ఎవ్వరికీ పైసా ఇవ్వలేదని అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు. ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ఓపీఎస్‌ వర్గం స్టింగ్‌ ఆపరేషన్‌ రూపంలో మదురై ఎమ్మెల్యే చేత అబద్దాలు చెప్పించిందని వారు విమర్శించారు.

వ్యాఖ్య: 

తమిళనాడుకి ఎమ్మెల్యే అయినా కాకపోతిని కోట్లకధిపతినవగా.. అనుకుంటాం అంతకన్నా వ్యాఖ్యానించేది ఏముంది?        చిన్న    చితకా అప్పులకయితే హత్యో నేరమో  ఘోరమో చేసినట్లు చానెల్స్ హంగామా చేస్తాయి కాని,  అటు విజయ    మాల్యాని  కాని ఇటు    శశికళని కాని పల్లెత్తు మాట అనరు….. అది విదితమే కదా అందుకే హాయిగా తమిళనాట ఎమ్మెల్యేలం అయితే అంతా కోట్లమయం, రాజభోగం.

వి – శేషం:

శశికళ   జైల్లో ఉండి కూడా ” నామాటే శాసనం” అని తమిళ రాష్ట్రాన్ని గడగడలాడిస్తోంది అంటే … అది కోట్ల సునామి అని అప్పుడే పుట్టిన పసిపిల్లకి కూడా తెలిసిన విషయమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక పక్క,  పక్కరాష్ట్రాల వాళ్ళు వరల్డ్ బ్యాంకు నుండి వేల   కోట్ల  అప్పులు చేస్తూ నవసమాజ నిర్మాణం అంటూ  పబ్బం గడుపుతూ ఉంటె…. అవే కోట్లతో దేశాన్ని కోనేయగలిగిన స్థాయికి చేరుకున్నారు ఈ  జైలు పక్షులు అని విమర్శకులు  ఆగ్రహిస్తున్నారు.

మాలాంటి సామాన్యులు మటుకు…. రాయినయినా కాకపోతిని… అదే అదే…. తమిళనాడుకి ఎమ్మెల్యే అయినా కాకపోతిని కోట్లకధిపతినవగా.. అని పాడుకుంటున్నాము..

సౌజన్యం:g24tvnews.com

-రమణి రాచపూడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *