Views:
28

సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి.. అసలు పేరు ఇదే అయినా.. సినారెగా అందరికీ సుపరిచితం. తెలుగు అక్షరమాలను హిమాలయ శిఖరాల ఎత్తులో నిలబెట్టిన కవి.  జ్ఞానపీఠ అవార్డు గ్రహిత.  సాహితీరంగంలో చెరగని ముద్ర వేసిన సినారె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు.

భూమ్యాకాశాల పుట్టుక నుంచి మొదలై… కాలం స్వరూపాన్ని, మనిషి వికాసాన్ని, చైతన్యాన్ని, ఆ చైతన్యం ప్రదర్శించిన విశ్వరూపాన్ని అనేక విధాలుగా తన “విశ్వంభర” గ్రంథంలో ఆవిష్కరించారు. మనసు శక్తి,  ఒక వ్యక్తిగా సాగితే జీవిత చరిత్రగా.. సమష్టిగా సాగితే సమాజ చరిత్రగా… ఎలా కనిపిస్తుందో సినారె కలం దాన్ని ఒడిసి పట్టుకుని మరీ మనముందు నిలుపుతుంది.మానవ ప్రస్థానంలో మజిలీలు, ఆ మజిలీల పునాదుల మీద భవిష్యత్తరాలు సాధించిన విజయాలు, ఆ విజయాల సోపానాల మీద పయనించిన మానవుడు పొందిన అనుభవాలు… అన్నీ ‘విశ్వంభర’ పద్య కావ్యంలో పాఠకుల కళ్లముందు సాక్షాత్కరింపజేసిన మహనీయుడు సినారె.   తొలుత కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. పాటకి కొత్త బాట వేసిన మహనీయుడు సినారె.

సి.నారాయణ రెడ్డి 1931 జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేటలో జన్మించారు. తండ్రి సాధరణ రైతు. ఆయన పేరు.. సింగిరెడ్డి సూర్యనారయణరెడ్డి. సినారె చిన్నతనం నుంచే హరికథలు, జానపదాలు వింటూ సాహిత్యం పై ఆసక్తిని పెంచుకున్నారు. పదో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివిన సినారె.. ఉస్మానియా యూనివర్శిటి నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ, డాక్టరేటు డిగ్రీ పొందారు.  1953లో సినారె రాసిన నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక పబ్లిష్ అయ్యింది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వచ్చాయి. తెలుగు నుడికారాన్ని, తెలుగు అక్షరాన్ని, తెలుగు పలుకుబడిని  నిలబెట్టిన కవితా తపస్వి డాక్టర్ సినారె. మొదట పద్య కవిత్వం రాసిన సి.నారాయణ రెడ్డి తరువాత గురజాడ రచనల స్పూర్తితో వ్యవహారిక భాషలో కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆయన కవితలు తెలుగుకే పరిమితం కాలేదు. ఎన్నో భాషల్లో అనువాదం అయ్యాయి.

సినారె ఎన్నో సినిమా పాటలను రాశారు. ‘గులేబకావళి కథ’ సినిమాలోని “నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ” అనే సూపర్ హిట్ అయ్యింది. ఆ పాట ఇప్పటికీ ఒక మధుర గీతమే. సింగిరెడ్డి నారాయణరెడ్డికి తెలుగు అంటే అమితమైన ప్రేమ. అందుకే “తెలుగుజాతి మనది నిండుగా వెలుగు జాతి మనది” అని పాటను రాశారు. ‘ఏకవీర’ సినిమాలో “నీపేరు తలచిన చాలు…” అనే పాటలో ముందు తెలుగు పదాలు వచ్చిన ఆ తరువాత వచ్చేవి దాదాపు సంస్కృత పదాలే వాడారు సినారె.  ఏఎన్ఆర్ నటించిన అందాల రాముడు సినిమాలో “మము బ్రోవమని చెప్పే సీతమ్మ తల్లి” అనే పాటను అందంగా రాశారు సినారె.

దాదాపు గా తెలుగు సినీ రంగంలోని అగ్ర హీరోలందరితో పాటు ఎందరో వర్ధమాన హీరోలకు పాటలను రాశారు సినారె. ఉర్దూ సాహితీ ప్రక్రియ గజల్స్ ను కూడా తెలుగులో రాసి గజల్ కవిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దాదాపు 3000కి పైగా పాటల వరకు రాశారు. స్నేహితుల గురించి సినారె రాసిన పాట స్నేహానికి నిలువెత్తు నిదర్శనం. నిప్పులాంటి మనిషి సినిమాలోని స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ రాసిన పాట స్నేహం విలువను చెప్పుతుంది. నారాయణ రెడ్డి అమ్మ గురించి పాటలు, కవిత్వాలు ఎన్నింటినో రాశారు. అమ్మ గురించి రాయలంటే ఆయన కలం ఉద్వేగంగా పనిచేస్తుంది. 20వ శతబ్దం సినిమాలోని అమ్మను మించిన దైవం ఉన్నాదా అనే పాటను వింటేనే అర్థం అవుతుంది అమ్మ  ప్రేమ ఎంత గొప్పదో. ప్రేమించు సినిమాలో కంటేనే  అమ్మ అని అంటే ఎలా పాట కూడా అమ్మ గురించి అద్భుతంగా చెప్పిన పాట. 2009లో వచ్చిన అరుంధతి సినిమాలో జేజేమ్మ సాంగ్  రాసింది కూడా సినారె.

ఆయన గ్రంథాలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడం వంటి భాషల్లోకి అనువాదమయ్యాయి.

సినారె అందుకున్న అవార్డులు – రివార్డులు:

1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు
1978లో ఆంధ్ర యూనివర్శిటి నుంచి కళా ప్రపూర్ణ అవార్డు
1977లో పద్మశ్రీ పురస్కారం
1992లో పద్మభూషణ్ పురస్కారం
1997లో రాజ్యాసభకు ఎంపిక.

నారాయణ రెడ్డి (సినారే) గారి మీద తనికెళ్ళ భరణి ఛలోక్తులు:

సి నా రె అన్నవి పొడి అక్షరాలూ కావు, పుప్పొడి అక్షరాలూ..
అందుకే సి నా రె ను పిండితే మకరందం జాలువారుతుంది
జొన్నరొట్టె మీద వెన్న పూస పూసినారె
తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారె
ఇంతింతై విశ్వంభర నంత చూసినారె
జ్ఞానపీటి పైన జానపదములేసినారె

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కళా ప్రపూర్ణ, పద్మశ్రీ, పద్మభూషణ్  శ్రీ సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి (సినారె ) గారికి మామాట అశ్రునివాళి

సౌజన్యం : వికీ పిడియా

-రమణి రచపూడి

One thought on “సినారెకి నివాళి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *