fake profiles social media computer scientists university of edinburg walid magdy adult content websites
Views:
19

సోషల్ మీడియా లేక సాంఘిక మాధ్యమాలు ఈ కాలంలో సమాచార విప్లవానికి దారితీసాయనే చెప్పవచ్చు. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక ఊహాజనిత ప్రపంచాన్నే సృష్టించేసాయి. జనాలు బయటి ప్రపంచంలోకన్నా వర్చువల్ ప్రపంచంలోనే బ్రతుకుతున్న రోజులివి. తాజా సమాచారం కావాలన్నా, కొత్త పరిచయాలు కావాలన్నా, ఏదైనా కొనాలన్నా, తమను తాము అందరికీ తెలిసేలా చేసుకోవాలన్నా ఫేస్ బుక్, లింక్డ్ ఇన్, వాట్స్ యాప్, లేదా గూగుల్ ప్లేస్, ట్విట్టర్ లాంటి సాంఘిక మాధ్యమాలు అద్భుతంగా అవసరాలన్నీ తీర్చేస్తున్నాయి. అయినవారు దగ్గర లేరు అనే బెంగ లేదు. ఇంటర్ నెట్ ఉండి ఒక స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్ ఉంటే చాలు ఎక్కడెక్కడివారో తెర మీద హాయ్, హలో అంటూ పలకరించేస్తారు. ఇన్ని లాభాల వెనుక నష్టాలు కూడా ఉన్నాయి.

 

కొంతమంది నకిలీ పేర్లతో ఖాతాలు సృష్టించుకుని సాంఘిక మాధ్యమాల్లో సంచరిస్తూ ఉంటారు. ఎన్ని మోసాలైనా చేస్తారు. సాంఘిక మాధ్యమాలు వ్యసనంగా కూడా మారిపోయిన ఈ రోజుల్లో చాలామంది నకిలీ ఖాతాల సృష్టికర్తల బారిన పడి ధన, మాన, ప్రాణాలను కూడా కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇంతమందిని అంతర్జాలంలో కలిపిన సాంకేతికత ఈ నకిలీ ఖాతాల భరతం పట్టేందుకు కూడా ఒక మార్గం ఉందని చెబుతోంది.

 

కంప్యూటర్ శాస్త్రవేత్తలు ఇటువంటి నకిలీ ఖాతాలను కనుగొనేందుకు సరికొత్త సాంకేతికతను కనుగొన్నారని సమాచారం. సోషల్ మీడియా వెబ్ సైట్ లలో 25 శాతం మంది తమ వయసేమిటో, తాము ఆడో మగో అన్న విషయాలలో నిజం చెప్పడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ ఖాతాల్లోకి జనాలను రప్పించడం కోసం, తమ పేజ్ లకు లైక్స్ కోసం నకిలీ ఖాతాల ద్వారా ఫిషింగ్ చేస్తారని చెబుతున్నారు సాంకేతిక నిపుణులు. మగవారికన్నా ఆడవాళ్లే ఎక్కువగా ఇలాంటివాటికి పాల్పడతారని శాస్త్రవేత్తల రిసర్చ్ లో తేలింది.

 

యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ కు చెందిన వాలిద్ మగ్దీ తాము చేసిన రిసర్చ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ రిసర్చ్ చేయడానికి తాము 5000 ప్రోఫైల్స్ ను ఎంపిక చేసుకున్నామని అన్నారు. అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సైట్స్ లో అసలు వివరాలు దాచిపెడతారు కాబట్టి వాటిని పరిశోధనా కేంద్రాలుగా ఎంచుకున్నామన్నారు వాలిద్. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ఉపయోగించి తాము అభివృద్ధి పరచిన సాంకేతికత నకిలీ ఖాతాలను గుర్తించడానికి, సాంఘిక మాధ్యమాలను నకిలీ ఖాతాలనుండీ సురక్షితంగా ఉంచడానికి పనికొస్తుందని అన్నారాయన.

 

నకిలీ ఖాతా కలిగినవాళ్ళు రాసే కామెంట్లు మరియు వారి నెట్వర్క్ యాక్టివిటీ ప్రాతిపదికన తాము అభివృద్ధి పరచిన కృత్రిమ మేధ ఆ నకిలీ ఖాతాదారుల లింగ నిర్ధారణను, వారి అసలు వయసును సమర్థవంతంగా కనిపెట్టేట్లు తయారు చేసామని అన్నారు వాలిద్. ఈ రిసర్చ్ వివరాలను ఆస్ట్రేలియాలో జరగబోయే అడ్వాన్సెస్ ఇన్ సోషల్ నెట్వర్క్స్ అనాలిసిస్ అండ్ మైనింగ్ అంతర్జాతీయ సదస్సులో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

2 thoughts on “సాంఘిక మాధ్యమాల్లో నకిలీ ప్రోఫైల్స్ గుర్తించే సాంకేతికత వచ్చేస్తోంది”

  1. హహ్హ మనమే కనుక్కోవచ్చు కామెంట్స్ ని బట్టి , ప్రొఫైల్ ని బట్టి మొదటి మాట కే అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు నకిలీ పెర్తతో ఉన్నారని… అయినా ఇది ఒకందుకు మంచిదే… భద్రతకు మరో దారి ఏర్పడింది. ముందంతా కాంక్రీటు మయం, సాంకేతిక భద్రత.

  2. మనం కనుక్కోవచ్చు కనుక్కోలేకపోవచ్చు…. ఒక మనిషి నిజంగానే తేడాగా మాట్లాడుతూ ఉండవచ్చు కదా…. అప్పుడు ఆ ఖాతాను నకిలీది అనుకోవడం నిజం కాకపోవచ్చు. సాంకేతికంగా ఒక అల్గారిథంను రాసి తద్వారా రకరకాల అంతర్గత ప్రశ్నలు తనను తాను వేసుకుని నిర్ధారణకు రావడం కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ గొప్పదనం. గూగుల్ అలాగే పనిచేస్తుంది. కానీ సోషల్ మీడియా అనేది వ్యక్తిగత ఖాతాలతో పనిచేస్తుంది కాబట్టి ప్రైవసీ గొడవలు ఉంటాయి. గూగుల్ ని పోలిన అల్గారిథంను సోషల్ మీడియా వెబ్ సైట్ లలో ఉపయోగించలేము. అందుకే ఇంత పరిశోధన. ఇది కాంక్రీటుమయం అనడం కన్నా ఊహాజనిత ప్రపంచంలోకి మరింత కూరుకుపోవడం అనుకోవచ్చు. సాంకేతిక భద్రత గురించి ఇంకా లోతైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలా జరగాలి కూడా. వైరస్ లు అన్నీ కూడా అడ్వాన్స్డ్ అల్గారిథంలే…. వాటికి అవే విరుగుడు…. కాబట్టి ఇది స్వాగతించదగ్గ విషయమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *