care, responsibility, leadership
Views:
15

జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరినుంచీ వినబడే మాటలు, ‘నాకెవరూ తోడు లేరు’, ‘నాకు ధైర్యం చెప్పేవారు లేరు’, నేను తలవాల్చడానికి ఒక భుజం లేదు’. జీవితంలోని ఏదో ఒక క్షణంలో, ఎదురుదెబ్బలు తగిలి మానసికంగా క్రుంగిపోయిన సమయాలలో అందరి మనసులలోనూ ఈ ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మరింత బాధకు గురి చేస్తాయి. ఇటువంటి ఆలోచనలు ఉండటం తప్పు కాదు. అది మనిషి సహజ లక్షణం. భయం, బలహీనత, అధైర్యం, విసుగు, కోపం, బాధ, మానసిక వత్తిడి, ఈ లక్షణాలు లేకపోతే మనిషి మనిషి కాదు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సంయమనంగా ఉండటం, ఆ స్థితిని అధిగమించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.  అవి సృష్టించే స్తబ్దతను, నిర్లిప్తతను దాటి రావడానికి సమయం పట్టవచ్చు. కానీ బయటపడకపోతే మాత్రం జీవితం అతలాకుతలమైపోతుంది.

ఆలోచనలను గమనిస్తూ మానసిక దౌర్బల్యాలనుండీ నేర్పుగా మనసును మళ్ళించడం ఒక గొప్ప విద్య. ఈ విద్య తల్లిదండ్రులనుంచీ వస్తుంది. అది తప్పితే మంచి మిత్రులనుండీ వస్తుంది. స్వంతంగా బయటపడే శక్తి రావడానికి గొప్ప మానసిక బలం కావాలి. జీవితం అన్నీ నేర్పుతుంది, మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే. జీవితంలో అన్నీ అందరికీ దక్కవు, ముఖ్యంగా మంచి మిత్రుల సాంగత్యం, లౌక్యాన్ని బోధించే విద్య, ధైర్యాన్ని నూరిపోసే మిత్రుల్లాంటి తల్లిదండ్రులు.

జీవితంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు క్రుంగిపోవడం సహజమని ఎలా ఆలోచిస్తామో, అంతే సహజంగా అందులోంచి బయట పడగలం అన్న ఆలోచన ఉండటం అవసరం. సరైన దారి చూపించేవారు లేనపుడు మనమే ఇంకొకరికి దారి చూపించే వారము కావాలి. తలవాల్చుకోవడానికి ఒక భుజం దొరకనప్పుడు మనం ఇంకొకరిని సేద తీర్చడానికి ప్రయత్నించాలి. ఇంకొకరికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తే ధైర్యంగా ఎలా ఉండాలో మనకెవరూ చెప్పనవసరం లేదు. ఇవన్నీ సులువు చెప్పడం ఉద్దేశ్యం కాదు. కష్టమే. నాదగ్గరే ఏమీ లేనప్పుడు నేను ఇంకొకరికి ఏమివ్వగలను అనే ఆలోచన పట్టి కుదిపేస్తుంది. చుట్టుపక్కల పరిస్థితులను గమనించుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నామో బేరీజు వేసుకోవాలి. బాధ్యత పట్ల చెయ్యగలమో లేదో అన్న సంశయం ఉండటం మంచిదేమోగాని అసలుకే భయపడటం మానుకోవాలి.

ఇంకొకరికి బాసటగా నిలబడగలిగితే అదే మనం నిలబడటానికి శక్తినిస్తుంది. ఒక ధైర్య వచనం, ఒక ఓదార్పు, ఒక మెప్పుకోలు, ఒక సహాయం, మనల్ని దార్శనికులుగా తీర్చిదిద్దుతాయి. ఇవన్నీ మనం మన శక్తిమేరకు ఇవ్వగలిగితే అదే నాయకత్వ లక్షణం.

రచయిత: యజ్ఞపాల్ రాజు ఉపేంద్రం

6 thoughts on “బాసటగా బాధ్యతగా నిలవడమే నాయకత్వ లక్షణం”

  1. “లెదు – కాదు” అన్న నిరాశ నుండి బయట పడినప్పుడు బాధ్యతలు నాగుపాములుగా కాక, పూలమాలలుగా మెడలో వ్రేలాడతాయి. బాధ్యతనెరిగిన వాడే బాసటగా నిలువగలుగుతాడు. అవరోధం అన్నది కార్యాచరణలో భాగమే కానీ పులుస్టాపుకు సంకేతం కాదు. సోమరులకు నిద్రలో తప్ప మరెక్కడ తావు ఉండదు. పనిలో పరమాత్మను చూడగల నేర్పు, ఒడుపే నాయకత్వ లక్షణానికి ఆలంబన. నీ అంతరావరణ సేద్యం బాగుంది యజ్ఞా! ఇలాగే కొనసాగించు. ఆచరించు..

  2. ఈ అబ్బయ్య ఎవురో బాగా ఇసయం ఇడమర్చి చెప్పాడు.

  3. చక్కటి వ్యాసం యజ్ఞా! ముఖ్యంగా యువత నిరాశలోకి జారకూడదు.

  4. ఆచరణీయ సందేశం. సమస్య లేకుంటే జీవితమే లేదు.

  5. మనసు బరువు తగ్గడానికి మందేదో చూడమనే కోరిక నుండి వచ్చిన భావావేశామా ఇది…. ఎందరిలో ఉన్నా, అందరిలో ఉన్నా మనిషి మనసెప్పుడూ ఒంటరిదే… నువ్వు బిజీ గా ఉండడానికి కారణం నేనయితే ఎంత బాగుండును అని ప్రేమికులు పరితపిస్తారు, సమస్యలకి తోడూ కావాలనుకోడం, లేదా తోడవడం తప్పులేదు కాని తోడే మనకి సమస్య కాకూడదు.నిష్కర్షగా చెప్పాలంటే మనసుకి ఒక తోడూ, ఒక భుజం, అన్నీ ట్రాష్ అన్నీ స్వార్థపు జీవితాలే. మనసెప్పుడు ఒంటరిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *