Views:
47

శీర్షిక

సమయానికి తగుమాటలాడటం తప్పుకాదు బాబూ!

పదుగురి నోళ్ల్లల్లో నానుతున్న అంశం:

‘నమో’ ‘గో’విందా! ఎవరు ‘గురివింద’?”

*********

పశువధ చట్టంపై పలు ప్రశ్నలు…

పశువధపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల క్రయవిక్రయాలపై పలు నిబంధనలు విధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ 26.05.2017న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులోని ముఖ్యాంశాలు:

 • సంతల్లో ఆవు, గేదె, ఎద్దు, ఒంటెల్ని కబేళాలకు అమ్మకూడదు, కొనకూడదు.
 • కేవలం వ్యవసాయ అవసరాల కోసమే పశువుల క్రయవిక్రయాలు జరగాలి.
 • పశువుల కొనుగోలు వ్యవసాయం కోసమేనని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
 • విక్రయాలపై పశువుల సంత కమిటీల నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
 • దూడలు, వట్టిపోయిన పశువుల విక్రయం పైనా నిషేధం.

కట్టుదిట్టమైన నిబంధనల్లో భాగంగా:- 1. పశువుల సంత నిర్వహణ కమిటీ పశు విక్రయాలకు సంబంధించిన రికార్డులు నిర్వహించాలి. దాదాపు ఆరునెలలు రికార్డులు అందుబాటులో ఉంచాలి. 2. అనుమతి లేకుండా పశువుల కొనుగోలుదారులు వేరే రాష్ట్రంలో వాటిని విక్రయించరాదు. 3. దూడలు, వట్టిపోయిన పశువులు సంతకు రాలేదన్న విషయాన్ని పశువుల సంత కమిటీకి చెందిన సభ్య కార్యదర్శి నిర్ధారించుకోవాలి. 4. పశువు విక్రయానికి సంబంధించిన ధృవీకరణపత్రం ఐదు కాపీల్ని- స్థానిక రెవెన్యూ అధికారి, పశువైద్యుడు, పశువుల మార్కెట్ కమెటీకి సమర్పించాలి. కొనుగోలు దారుడు – ఆమ్మకదారుడు తమ వద్ద ఒక్కొక కాపీ ఉంచుకోవాలి.

-ఈ నిబంధనలను, చట్టాన్ని జంతు ప్రేమికులు, శాకాహారప్రియులు స్వాగతిస్తుంటే; ఉభయాహారప్రియులు, పౌరహక్కులసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు విభేదిస్తున్నారు.

అప్పుడే ఉన్నత న్యాయస్థానాల జోక్యం కూడా మొదలైంది. ప్రతికూలంగా కొన్ని రాష్ట్రాల హైకోర్టులు, గోవధకు ఏకంగా యావజ్జీవ కారగార శిక్ష విధించేలా చట్టం తేవాలంటూ రాజస్థాన్ హైకోర్టు  కేంద్రానికి తాఖీదులు ఇచ్చాయి. “ఈ ప్రేమ అన్ని జంతుల మీదనా? లేక కేవలం గోవధ నిషేధాన్ని చట్టబద్దం చేసి కఠిన శిక్షలు విధించేందుకా?” అని హక్కుల సంఘాలు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.

ఆహార నియమాలపై పూర్వాపరాలు… 

ఋగ్వేదకాలపు ఆర్యులు ప్రధానంగా శాకాహారులైనా, వర్ణవిభేదం లేకుండా మాంసాహారులు కూడా. గోమాంసం, అశ్వమాంసంతో సహా రకరకాల మాంసాహారాలను వారు భుజించేవారు. (ఇందుకుకు తార్కాణాలెన్నో వేదాల్లోనే కనిపిస్తాయి, కనుక అది వేరే చర్చ) వారు గోవును అతి పవిత్రమైన జంతువుగా భావించేవారు. కానీ, అదే సమయంలో గోమాంస భక్షణాచారం ఉండేది.  ఇంటికి ముఖ్యమైన అతిథి వచ్చాడంటే గోమాంసం వండేవారు.  ఆవిధంగానే అతిథికి ‘గోఘ్నుడు’ అనే నామం వాడుకలోకొచ్చింది.  క్రమక్రమేణా గోసంపద తరిగిపోతుండడం, బౌద్ధ, జైన మతాల ప్రభావం తదితర సామాజిక పరిణామాల వలన హిందూమతంలో గోవధ అపచారంగా మారింది. అంతేకాక కొన్ని సామాజికవర్గాలలో మాంసాహారం కూడా పూర్తిగా నిషిద్ధమైంది.

రాతియుగ మానవుడు పూర్తిగా మాంసాహారి. నిప్పు పుట్టి పచనం ఆరంభం అయ్యాక మనిషి ఉభయాహారిగా మారాడు. వివిధ నాగరికతలు, మతాలు, సంప్రదాయాలు, ఆచారారాలు మానవుని ఆహారవిహారాల మీదా ప్రభావం చూపాయి. కుల వ్యవస్థ వేళ్లూనుకుంటున్న సంధియుగంలో శాకాహారం, మాంసాహారం కూడా కులం రంగు పులుముకున్నాయి. ఇంతెందుకు కొన్ని రామాయణగాధలు రాముణ్ణి శాకాహారిని చేస్తే, మరికొన్ని రామాయణగాధలు మాంసాహారిని చేశాయి. ఆదిపత్యభావజాలం రాముడ్ని శాకాహారిగా మిగిల్చే యత్నంలో సఫలీకృతమైనది.

మనలో కొందరు చెట్లను (తులసి, వేప వగైరా), పుట్టలను (పాము వగైరా), పక్షులను (గరుడ, నెమలి వగైరా) జంతువులను (ఆవు, ఎద్దు, ఏనుగు వగైరా) పూజించడం కద్దు. అది వారివారి విశ్వాసానికి సంబంధించిన వ్యవహరం. పూజించే జంతువులను భుజించరాదన్న నియమాన్ని సంబధిత ఆరాధకులు పాటించవచ్చును. అందరినీ, పాటించాలన్నప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రశ్నల పరంపర ప్రారంభమవుతుంది. కేవలం గోవధ పేరుతో కాకుండా పశువధ పేరుతో ఇప్పుడీ తేనెతుట్టెను కేంద్రం మళ్లీ కదిపింది. రకరకాల నిప్పులు రాజుకుంటున్నాయి. పర్యవసానాలు, పరాకాష్టలు సుప్రీం కోర్టుకెక్కాకగానీ తెమలవేమో!?

ఉపసంహారం:- కీటకాలను, పాములను, కప్పలను, బల్లులను ప్రీతిగా  భుజించే దేశవాసులను అసహ్యించుకునే హక్కు మరోదేశవాసులకు ఉండదు. అలాగే రుచులు – అభిరుచులు వారివారి స్వంతములు. మన జిహ్వకు పట్టకపోతే ముక్కు మూసుకోవడంలో తప్పు లేదు. “వెక్కిరిస్తాం – వెలివేస్తాం ” అని విర్రవీగితే ఎండు చేపలై వ్రేలాడక తప్పదు..

-వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

02.06.2017 – శుక్రవారం

 

 

11 thoughts on “‘నమో’ ‘గో’విందా! ఎవరు ‘గురివింద’?”

 1. చెట్టు పుట్ట పాము పక్షి పశువు అన్నిట్ని పూజించి చంపకుండా ఉంటే ప్రెపంచకంలో మనిషి మరుగుజ్జై పోతాడేమో సార్!

  • మనం పర్యావరణ ప్రేమికులం అయ్యుండీ కారులో, విమానంలో ప్రయాణిస్తాం. జంతు ప్రేమికులంతా మాంసాహారం భుజించ కూడదన్న నియమం ఏం లేదు. ప్రాణులను హింసించడం వేరు, భుజించడం వేరు. శాకాహారులు అయివుండీ జీవహింసకు పాల్బడే వారు ఎందరో ఉన్నారు..

 2. ఉభయాహారినే అయినా జంతు బలులు, పెంపుడు పశువులను కబేళాలకు అమ్మడం అన్నదానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఒక్క గోవు అనే కాకకుండా మూగజీవాలన్నిటికీ సంరక్షణ అవసరం.

 3. చికెన్ అంటే ఇష్టంగా తింటాను. కానీ జంతుహింసను తట్టుకోలేను, చూడలేను.

 4. ఎవుడి రాజకీయం వాడిది. జనాలే గొర్రెలకింద లెక్క.

 5. “కీటకాలను, పాములను, కప్పలను, బల్లులను ప్రీతిగా భుజించే దేశవాసులను అసహ్యించుకునే హక్కు మరోదేశవాసులకు ఉండదు. అలాగే రుచులు – అభిరుచులు వారివారి స్వంతములు. మన జిహ్వకు పట్టకపోతే ముక్కు మూసుకోవడంలో తప్పు లేదు. “వెక్కిరిస్తాం – వెలివేస్తాం ” అని విర్రవీగితే ఎండు చేపలై వ్రేలాడక తప్పదు..” -ఇది జంతు బలులను, మూగజీవాలను కబేళాలకు తరలించే చర్యలను సమర్థించే వ్యాఖ్య కాదు. ఇతరుల ఆహారపు అలవాట్లను కించపరచడం తప్పని చెప్పడమే ఉద్దేశం.

 6. ఏ ఆచారమయినా దురాచారమయినా మనం అంటే మనుషులు కనిపెట్టినవే.. పక్షి జాతి అంతరించిపోయింది దాదాపుగా మన సాంకేతిక పరిజ్ఞాన గ్లోబల్ వార్మింగ్ వల్ల.మేకలు, కోళ్ళు లాంటి చిన్న జంతువులను పక్షుల్స్ను ఆహారంగా చేసుకున్నాము. పశు వధ/గోధ ఇలాగే కోసగితే జంతువులు అంతరించిపోతే ?? రుచి మరిగిన మానవుడు విచక్షణా జ్ఞానం కోల్పోయి నర మాంసానికి అలవాటు పడతాడేమో .. పాప పుణ్యాలు, పుక్కింటి పురాణాలు పక్కన పెడితే మన ఉనికి కాపాడుకోడానికి చట్టాలు అవసరమే. అలాగే గోవు వల్ల మనం పొందుతున్న లాభాలు అనేకం కాబట్టి ఆ జాతి అంతరించిపోకుండా చూసుకోవడం, మానవుడి బాధ్యత. దీనికి శాఖాహారులు, మాంసాహారులు, మతాలూ కులాలు అడ్డుగోడలుగా నిలుపుకోనవసరమ లేదని నా అభిప్రాయం

 7. అలవాట్లను, ఆహారాన్ని రాజకీయం చేయడం దేశంలోని ఒక వర్గం వారిని కట్టడి చేయడానికే అని మేథావులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఎండు చేపల పులుసులా కమ్మగా సాగింది మీ వ్యాఖ్యానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *