thyroid gland
Views:
340

మానవ శరీరం వైవిధ్యమైనది. మిగితా జంతుజాలంలో లేని ప్రత్యేకతలు మనిషి శరీరానికి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నిర్మాణపరంగా అత్యంత ప్రత్యేకమైనది మానవ శరీరం. అందులో ముఖ్యమైన భాగాలలో రకరకాల హార్మోన్లను స్రవించే గ్రంధులు ఇంకా ప్రత్యేకం. ఆ గ్రంధులలో అవటు గ్రంధి లేదా థైరాయిడ్ గ్రంధి ఒకటి. థైరాయిడ్ గ్రంధి ఎదుగుదలకు సంబంధించిన గ్రోత్ హార్మోన్ ను స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంధికి సంబంధించిన సమస్యలను హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ కాలపు జీవనశైలికి సంబంధించిన పొరపాట్లు థైరాయిడ్ సమస్యలకు దారి తీస్తాయి. 

మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్బంగా మనం ఇప్పుడు సమాజంలో ప్రజలకు ఈ వ్యాధుల పట్ల ఉన్న అపోహలను మరియు వాటికి సంబంధించిన వాస్తవాల గురించి విశ్లేషించుకుందాం.

1 అపోహ: థైరాయిడ్ జబ్బు చిన్నదే, వాటికి మందులు వాడనవసరం లేదు.

వాస్తవం : థైరాయిడ్ జబ్బులు పలు రకాలు, థైరాయిడ్ హార్మోన్ శరీరంలో తక్కువ స్రవిస్తుంటే దానిని హైపోథైరోయిడిజం అని, అదే ఎక్కువ ఉంటే హైపర్థైరోయిడిజం అని అంటారు. థైరాయిడ్ గ్రంధి వాస్తే దానిని గోయిటర్ అని అంటారు. ఈ వ్యాధుల వల్ల శరీరంలో మిగతా అవయవాలు సరిగా పనిచేయవు. కాబట్టి ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ఎండోక్రైనోలోజిస్ట్ చెప్పిన విధంగా మందులు వాడాలి.

2. అపోహ: హైపోథైరోయిడ్ వ్యాధిగ్రస్తులు ఒక్కసారి మందులు వాడితే మళ్లా వేసులోవలసిన పని లేదు

వాస్తవం: థైరాయిడ్ గ్రంధి బలహీన పడితే, హైపోథైరోయిడిజం వస్తుంది. వీళ్ళు జీవితాంతం థైరాక్సిన్ మందు వేసుకోవలసి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి TSH పరీక్ష చేయించు కుంటూ, సరియైన మోతాదు లో మందు వేసుకోవసి ఉంటుంది.మందులు మనివేస్తే మళ్లా జబ్బు తిరగ పెడుతుంది. మందులు ఆప కూడదు.

3.అపోహ: థైరాక్సిన్ మందు రోజులో ఎప్పుడైనా వేసుకోవచ్చు.

వాస్తవం: థైరాక్సిన్ మందు నిద్ర లేవగానే పళ్ళు తోముకొని గ్లాసు నీళ్లతో వేసుకోవాలి, తరువాత ఒక గంట వరకు పాలు కాఫీ టిఫిన్ వద్దు. ఒకరోజు మాత్ర మరచి పోతే పక్క రోజు రెండు డోసులు వేసుకోవాలి. ఎవరైనా కాల్షియం, ఐరన్, యాంటాసీడ్ మాత్రలు వేసుకొనే వాళ్ళు అవి మద్యాహ్నం వేసుకోవాలి, ఉదయం వద్దు, ఎందుకంటే ఈ మాత్రలు థైరాక్సిన్ పనితనాన్ని తగ్గిస్తాయి.

4.అపోహ: థైరాయిడ్ పేషెంట్స్ మాంసాహారం, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఆకుకూరలు తినకూడదు.

వాస్తవం: థైరాయిడ్ జబ్బుకు ఆహారానికి సంబంధం లేదు. అన్ని ఆహారపదార్థాలు తినవచ్చు. పత్యం ఏమి లేదు. ఒక్క ఉప్పు విషయంలో కళ్ళు ఉప్పు వాడకూడదు. అయోడిన్ కలిగిన పేకెట్ ఉప్పు మాత్రం వాడాలి.

5.అపోహ: థైరాయిడ్ పరీక్షకు వచ్చేటప్పుడు ఏమి తినకుండా, మాత్ర వేసుకోకుండా వచ్చి రక్తం ఇవ్వాలి.

వాస్తవం: థైరాయిడ్ పరీక్ష రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి ఆహారానికి సంబంధం లేదు. పరీక్ష రోజు కూడా ఉదయాన్నే మాత్ర వేసుకోవాలి.

6.అపోహ: అన్ని గొంతు వాపు, గాయిటర్ లు, కాన్సర్ లే, అన్నింటికీ ఆపరేషన్ చెయ్యాలి.

వాస్తవం: గాయిటర్ అనే వాపు హైపోథైరోయిడిజం లో, హైపర్ థైరోయిడిజం లో, అయోడిన్ లోపంతో, కాన్సర్ గడ్డల వల్ల రావచ్చు. అన్నింటికీ ఆపరేషన్ అవసరం లేదు. గడ్డలు ఉంటే వెంటనే అల్ట్రా సౌండ్ స్కానింగ్, థైరాయిడ్ టెస్టు మరియు నీడిల్ FNAC పరీక్ష చేయించు కొని ఆ గడ్డలు మంచివా చెడువా అని నిర్ధారించుకోవాలి. అప్పుడే ఆపరేషన్ అవసరమా లేదా అని తెలుస్తుంది.

7.అపోహ: షుగర్ పేషెంట్స్ థైరాయిడ్ టెస్టు చేయించుకొనవసరం లేదు.

వాస్తవం: ప్రతి 100మంది షుగరు పేషెంట్స్ కు 20నుంచి 30 మందికి థైరాయిడ్ ఉంటుంది. కనుక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి థైరాయిడ్ టెస్టు చేయించుకోవాలి. థైరాయిడ్ కంట్రోల్ లో లేకపోతే షుగర్ కూడా అదుపు తప్పుతుంది.

8.అపోహ: థైరాయిడ్ కి వైద్యం ఏ డాక్టర్ అయినా చేస్తారు.

వాస్తవం: థైరాయిడ్, షుగరు మరియు హార్మోన్ వ్యాధులకు అతిపెద్ద వైద్యులు DM ఎండోక్రైనోలోజిస్ట్ మాత్రమే. వీళ్లు ఈ జబ్బులలో అత్యంత నిపుణులు. కనుక ఏ విధమైన థైరాయిడ్ సమస్యలు వచ్చినా వెంటనే ఎండోక్రైనోలోజిస్ట్ ని కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలి.

30 సంవత్సరాలు వయసు పైబడిన ప్రతిఒక్కరు, ఊబకాయం కలిగినవారు, గొంతు క్రింద వాపు గాయిటర్ ఉన్నవారు, షుగరు ఉన్నవారు, ఎత్తు సరిగా ఎదగని మరియు ఎక్కువ బరువు ఉన్న పిల్లలు, నెలసరి సమస్యలు కలవారు, పిల్లలు కలగని దంపతులు, చర్మం పై తెల్ల మచ్చలు కలిగిన వారు తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి

మనమందరం థైరాయిడ్ గురించి తెలుసుకొని, సరిగా వైద్యం చేసుకుంటూ, ఈ అపోహలన్నింటినుంచి దూరంగా ఉంటూ, ఆనందంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకొందాం.

 

రచయిత:

DR MV రామ మోహన్ MD DM.

ఎండోక్రైనోలోజిస్ట్ (హార్మోన్ డాక్టర్ )

అపోలో స్పెషలిటీ హాస్పిటల్ నెల్లూరు

 

15 thoughts on “కొంపముంచే థైరాయిడ్ సమస్య”

  1. DR MV రామ మోహన్ MD DM. ఎండోక్రైనోలోజిస్ట్ (హార్మోన్ డాక్టర్ ) థైరాయిడ్ సమస్యలపై ఇచ్చిన వివరణ (అపోహలు – వాస్తవములను వివరించి చెప్పడం) చాలా బాగుంది. ఈ వ్యాసం చదివితే అందరి అపోహలు తొలగి పోతాయి..

  2. డాక్టర్ సారు బాగా ఇడమరచి అందరికీ అర్ధం అయ్యేట్టు చెప్పారు

  3. థైరైయిడ్ సమస్యపై చక్కటి వ్యాసం వ్రాసినందుకు ధ్యాంక్స్. డయాబిటిక్ పేషెంట్స్ కు వున్న అపోహల పైన, ఆహార విధానాల పైన డాక్టర్ గారి నుండి మంచి సూచనలను కోరుకుంటున్నాము.

  4. వ్యాధిపైన మంచి అవగాహన కల్పించిన డాక్టర్ గారికి ధ్యాక్స్

  5. మామాట నుండి ఆరోగ్య సమస్యలపై ఇలాంటి విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రావాలనే కోరుకుంటున్నాను.

  6. మేమందరం డా. రామమోహన్ సార్ నుండి ఇలాంటి మరిన్ని మంచి వ్యాసాలను స్వాగతిస్తున్నాము.

  7. పాఠకులకు అర్థంకాని వైద్య పరిభాషతో ప్రజ్ఞా ప్రదర్శన చేయకుండా.. సరళమైన పద్ధతిలో థైరాయిడ్ గురించి వివరించడం అభినందనీయం. ఈ సమాచారం అందరికీ ఉపయోగకరమే.

  8. ఈ కాలపు జనాలకు అవసరమైన సమాచారం. జీవన విధానంలో మార్పుల వాళ్ళ వచ్చే లైఫ్ స్టైల్ అనారోగ్యాలలో థైరాయిడ్ ఒకటి. జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *