Views:
52

“విద్యయామృతమశ్నుతే”

దీనికి అర్థం స్థూలంగా చెప్పుకోవాలంటే, విద్యయే అమృతము లేదా విద్య ద్వారా అమరత్వము అని అనుకోవచ్చు. విద్య మానవ జీవితానికి సార్థకతనిస్తుంది అన్నది నిర్వివాదాంశం. నిన్నటి ఎన్నో తరాలు తగిన విద్య నేర్చుకోవడానికి ఎన్నో కష్టాలను, ప్రయాసలను ఎదుర్కొన్నాయి. అంత కష్టంలో కూడా వెనుదిరగకుండా, మనసులో విద్య పట్ల తరగని ఆర్తితో ఎందఱో మహానుభావులు చక్కగా చదువుకుని ప్రపంచవ్యాప్త ఖ్యాతిని సాధించారు. ఇవే పరిస్థితులు మన దేశంలో ఇంకా ఉండటం సిగ్గుపడాల్సిన విషయం. కులము, మతము విద్య నేర్చుకోవడానికి ప్రాతిపదికలవుతున్న సంఘటనలు ఇప్పటికీ సంభవిస్తూనే ఉన్నాయి.

విద్య గొప్పదనం ఇక్కడే బయటపడుతుంది. మొక్కవోని ఆత్మవిశ్వాసానికి ప్రపంచమే తలవంచి నమస్కరిస్తుంది అన్నదానికి ఉదాహరణ రోణంకి గోపాలకృష్ణ. మారుమూల ప్రాంతాలనుంచీ ఎన్నో ఆశలతో వచ్చి తిరస్కారాల్ని, చీత్కారాల్ని ఎదుర్కొని చివరకు వీటన్నిటికీ ఎదురీది నిలిచిన వారిని చూస్తూనే ఉన్నాం. ఆంగ్ల మాధ్యమం ప్రభంజనం సృష్టిస్తున్న ఈ కాలంలో ఇంటర్, డిగ్రీ వరకూ కూడా తెలుగు మాధ్యమంలో చదివి ఇవాళ దేశవ్యాప్తంగా యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో 3వ ర్యాంకు సాధించాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, పారసంబ గ్రామానికి చెందిన రైతు దంపతులు, రోణంకి అప్పారావు, రుక్మిణిల ద్వితీయ సంతానం గోపాలకృష్ణ. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి, పలాసలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తెలుగు మాధ్యమంలో ఇంటర్ పూర్తి చేసాడు. తరువాత  పశ్చిమగోదావరి జిల్లాలోని దూబచెర్ల లో టీచర్ ట్రైనింగ్ కోర్సు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అవసరార్థం పని చేస్తూనే ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ద్వారా బీఎస్సీ చదివాడు. గత పదేళ్లుగా అయ్యేయస్ కావాలన్న కలను సజీవంగా ఉంచుకుని అదే ఊపిరిగా బతికానని చెప్తాడు గోపాలకృష్ణ. తాను ఇంటర్ చదివేనాటికి విద్యుత్తు సదుపాయం కూడా లేదని, ఇప్పుడు తాను కలెక్టర్ అవుతానన్న ఆలోచన అంతులేని ఆనందాన్ని ఇస్తోందని గోపాల కృష్ణ అంటున్నాడు.

గత పదేళ్లుగా తాను పడిన కష్టం అంతా చేత్తో తుడిచేసినట్టు ఉందని అంటూ తన విజయం తల్లిదండ్రులకు అంకితం చేసాడు గోపాలకృష్ణ. తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుని, మౌఖిక పరీక్షలో కూడా అనువాదకుడి సహాయంతో నెగ్గి దేశవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచాడు ఈ పట్టువదలని విక్రమార్కుడు. లక్షలు ఖర్చుపెడితే తప్ప ర్యాంకులు రావు అనుకునే వారికి గోపాలకృష్ణ ఉదంతం చెంపపెట్టులాంటిది. ఆత్మస్థైర్యం, సాధించగలనన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటె మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడీ యువరత్నం.

 

వార్తా సేకరణ: యజ్ఞపాల్ రాజు ఉపేంద్రం

14 thoughts on “ఉవ్వెత్తున ఎగిసిన విద్యా కెరటం”

 1. కార్పొరేటు కాన్వెంట్లు మనకొద్దురో డింగరీ!
  అరువు చదువుల ఆయాసం అసలొద్దురో డింగరీ!
  శ్రద్ధ పెడితే చదువు అబ్బురా డింగరీ!
  ఐ.ఏ.ఎస్. భారమవదురా డింగరీ!
  -అని రుజువు చేసి చూపించిన మన తెలుగు తేజం రోణంకి గోపాలకృష్ణకు విజయాభినందనలు. ఈ చిరంజీవి స్పూర్తితో కార్పొరేట్ బందిఖానాలకు అంకితమైన వారు తమ దారిని కొంతైనా మరల్చుకుని క్రొత్త పుంఖలు తొక్కండి..

 2. గత పదేళ్లుగా తాను పడిన కష్టం అంతా చేత్తో తుడిచేసినట్టు ఉందని అంటూ తన విజయం తల్లిదండ్రులకు అంకితం చేసాడు గోపాలకృష్ణకు జేజేలు…

 3. “విద్యయామృతమశ్నుతే” -అన్న సూక్తిని సార్ధంకం చేసిన గోపాలకృష్ణకు అభినందనలు… ఆశీస్సులు.

 4. ఎందరికో మార్గదర్శకం అయిన గోపాలకృష్ణకు అభినందనలు

 5. తెలివి, తెగువ వున్న విద్యార్ధులకు ఏ బడియైనా ఒక్కటే, కృషి – పట్టుదల – కార్యదీక్ష శిఖరాగ్రానికి చేరుస్తాయని ఋజువు చేశాడు మన గోపాపకృష్ణ. అభినందనలు తమ్ముడూ…

 6. “ఎక్కే దమ్మున్నోడికి ఎవరెస్టయినా చిన్నదే” -అని నిరూపించిన గోపాలకృష్ణకు ఇకపైనా అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటున్నాను.

 7. గోపాలకృష్ణునికి విజయాభినందలు. భలిష్యత్తులోనూ ఇదే స్పూర్తి కొనసాగాలని కోరుకుంటున్నాను.

 8. మా జిల్లా వోడు.. మా ప్రాంతం వోడు.. మాకే కాదు, దేశంలోని యువతకే స్ఫూర్తిదాయకంగా నిలిచినవోడు. మరి గర్వకారణమే కదేటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *