Views:
38

వీరవిధేయతకు, పాదాభివందనాలకు, అనుపమానమైన స్వోత్కర్షలకు తెలుగు చలన చిత్రరంగం పెట్టింది పేరు. ఈ దొంగ వినయాలను, నంగి మాటలను మొండిగా తోసిపుచ్చి తన సత్తాతో జగజ్జేతగా నిలిచినవారు ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు. హీరోల ప్రాబల్యంతో సినిమాలను ఆడించేస్తున్న అప్పటి రోజుల్లో.. వారు కేవలం కథలో పాత్రలు మాత్రమేనని చాటి చెప్పి; కథా బలం వున్న సినిమాలతో విజయకేతనం ఎగురవేసినవారు దాసరి నారాయణ రావు. శతాధిక చిత్రాలు ఖాతాలో వుండగా కొన్నిటి పేర్లు ప్రస్తావించడం భావ్యం కాదు. కేవలం కథ మాత్రమే కాదు, సన్నివేశానికి తగిన సంభాషణ, కథను నడిపే గీతాలు, అనుగుణ్యమైన చిత్రణ కేవలం దాసరికి మాత్రమే చెల్లు. హిట్టు మీద సూపర్ హిట్టు కొట్టిన దాసరి ఏ దశలోనూ తగ్గకుండా తెలుగు సినీ పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. అది ఒక దశలో ఏ స్థాయికి చేరిందంటే.. నిర్మాతలు ఆఫీస్ కు వచ్చి డబ్బు ఇచ్చి వెళ్లిపోయేవారు. సినిమా కథ ఏంటనిగానీ, షూటింగ్ ఏ దశలో వుందనిగానీ అడిగే సాహసం ఏ నిర్మాతా చేసేవారు కాదని చెప్పుకునేవారు. అంతటి మొండిఘటం మన దాసరి నారాయణరావు.

సినిమాల్లో విజయాలను సొంతం చేసుకుంటూ, అపజయాలను అర్థం చేసుకుంటూ ఓ దశకు చేరుకుని చాలామంది సినీ కార్మికులకు పెద్దదిక్కుగా నిలిచారు. ఆ తర్వాత ఉదయం దిన పత్రిక ప్రారంభించడం దాసరి సృష్టించిన మరో సంచలనం. దాంతోపాటు వెలువడిన శివరంజని సినీ పత్రికకు అప్పట్లో మంచి పేరు ఉండేది. సెంటర్ స్ప్రెడ్ ను అందరూ బ్లో అప్ పేరుతో డబుల్ సైజులో ఇస్తే శివరంజనిలో నాలుగింతల సైజులో వెలువడేది. కొన్నేళ్లకు ఉదయం మూతపడినా, ఆ సంచలనం అలాగే నిలచిపోవడం వెనుక దాసరి ముద్ర ఉంది.

సామాజిక సమీకరణాలలో భాగంగా దాసరి రాజకీయ జీవితం మాత్రం సామాన్యంగానే సాగింది. కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. చివరి దశలో కేసులు ఎదుర్కొన్నప్పటికీ చెప్పుకోదగ్గ సంచలనాలేమీ జరగలేదు. అయితే, తెరవెనుక మాత్రం దాసరి హస్తం చాలా చక్రాలనే తిప్పిందని రాజకీయాలు తెలిసినవారు చెప్పుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి తెర జీవితానికే కాకుండా, రాజకీయ జీవితం వెనుక కూడా దాసరి అండగా నిలిచారని కొందరు సన్నిహితులు భావిస్తూంటారు.

చిరంజీవి, బాలకృష్ణలకు ఎందకనో దాసరి సూపర్ హిట్ లు ఇవ్వలేకపోయారు. కొత్త తరం హీరోల్లో నాగార్జునతో చేసిన మజ్నూనే సూపర్ హిట్. తనలాగే దూకుడు ప్రదర్శించే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని దాసరి ఉత్సాహం చూపించారు. పవన్ కూడా పచ్చజెండా ఊపారు. ‘బోస్’ అనే టైటిల్ ను కూడా రిజిస్ట్రర్ చేసినప్పటికీ.. ఓ వైపు రాజకీయంగా ఇరువురూ బిజీగా వుండటం, మరో వైపు దాసరి ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆ కోరిక తీర్చుకోలేకపోయారు.

దాసరి నారాయణరావు జీవిత విశేషాలు పరిశీలిస్తే.. ఆయనలోని పట్టుదలకు మూలం ఆ జీవన గమనంలోనే ఉందని అనిపిస్తుంది. 1947 మే 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో దాసరి పుట్టారు. మొదట్లో ఆస్తిపాస్టులు బాగానే వున్నప్పటికీ పొగాకు వ్యాపారం చేసే తండ్రి.. గొడౌన్ తగులబడటంతో ఆస్తులు అమ్ముకోవడం మొదలయ్యింది. దాసరి తండ్రికి ఆరుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. దాసరి మూడోవాడు. దీంతో దాసరి ఆరో తరగతికి వచ్చేసరికి స్కూల్ ఫీజు రూ.3 కట్టేందుకు కూడా కష్టంగా ఉండేది. దాంతో తండ్రి దాసరిని బడి మాన్పించి నెలకు రూపాయి జీతానికి వడ్రంగి దుకాణంలో చేర్పించాడు. స్కూలు రోజుల నుంచే నాటకాలపై మక్కువ పెంచుకున్న దాసరి, తండ్రి వారిస్తున్నా వినకుండా నాటకాల్లో పాల్గొనేవారు. అలా నాటకాల నుంచి సినిమాల్లో అగ్రశ్రేణి దర్శకుడిగా దాసరి ఎదిగారు. అప్పట్లో హీరోలతో సమానంగా దర్శకుడికీ పేరు తీసుకొచ్చినవారు దాసరి. ఒక దశలో దర్శకరత్న దాసరికి 18వేల అభిమాన సంఘాలు ఉండేవంటే.. ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో వున్న పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

దాసరి నారాయణరావు హీరో అక్కినేని నాగేశ్వరరావు అభిమాని అందరికీ తెలిసిందే. అందుకే ఏఎన్నార్ తో దాసరి చాలా చిత్రాలు చేశారు. ఎన్నో సూపర్ హిట్ లు ఇచ్చారు. మహానటుడు ఎన్టీ ఆర్ ను రాజకీయ పథంలో దూసుకుపోయేలా చేసి, సీఎం పీఠాన్ని అధిష్టించేలా చేసిన రెండు సూపర్, డూపర్ హిట్ సినిమాలను అందించినది కూడా దాసరి అని చాలామంది విశ్లేషకులు భావిస్తారు. అవి బొబ్బిలిపులి, సర్దార్ పాపా రాయుడు చిత్రాలు.

ఇక చివరి దశకు చేరుకున్నారని అంతా భావించిన తరుణంలో ఒసేయ్.. రాములమ్మ లాంటి బ్లాక్ బస్టర్ అందించి తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నారు దాసరి. రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రతిష్టాత్మకమైన ఎన్నో అవార్డులను దాసరి సొంతం చేసుకున్నారు. దాసరి గురించి చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. తెల్సుకోవాల్సినవి మిగిలే ఉంటాయి. దాసరి ఓ శకం. ఓ ల్యాండ్ మార్క్.

ఏదిఏమైనా, ఏటికి ఎదురీదేవారికి దాసరి ఓ చుక్కాని, ఓ దిక్సూచి, ఓ స్ఫూర్తి.

-లైన్ కింగ్

8 thoughts on “జగజ్జేతగా నిలిచిన జగమొండి దాసరి”

 1. దాసరి కూడా చనిపోతాడు…

  తన రంగం లో తాను నెంబర్ వన్…
  అన్ని ప్రక్రియల్లో తానే విన్నర్…
  దర్శకులకు తానో రోల్ మోడల్…
  ఆయనకు సాటి ఎవరూ లేరు.. ఎవరూ రారు..
  ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.. 🙏🙏
  మనం కూడా పోతాం..
  అంతకంటే ముందు ఆయనలాగా కొందరికి కొత్త జీవితాన్ని ఇద్దాం..
  మనుషుల్ని కాస్త ప్రేమిద్దాం..

  మనుషులుగా మిగిలేందుకు కృషి చేద్దాం… 😢😢

  దాసరిగారు అమర్ రహే 💐💐

  • క్రిష్ కామెంట్ సరే.. మీరేమంటారో చెప్పండి

 2. మొండివాడు తన శైలితో, ప్రతిభతో విజయాలు సాధించినప్పుడు జగజ్జేతగా వినుతికెక్కుతాడు. పొరపాటున ఓటముల వెన్నంటి ఉన్నంతకాలం జనం ఆతని మొండితనాన్ని మూర్ఖత్వం అని గర్హిస్తారు. దూషణ, భూషణ, తిరస్కారములను విజయపథానికి సోపానాలుగా భావించి తన ఎదురీతను కొనసాగించి దాసరి ఎందరికో ఓ చుక్కాని, ఓ దిక్సూచి అయిన మాట వాస్తవం.
  వ్యాసం చివరన పేరు లేకుండా వ్యాసం వ్రాసిన రచయిత (సిగ్గరి అనుకుంటా) ఎవరో కానీ, దాసరి గురించి మాత్రం చక్కగా విశ్లేషించారు. ఈ అనామధేయ (కలంపేరైనా పెట్టుకోవచ్చు కదా?) వ్యాసకర్తకు మిక్కిలి అభినందనలు..

 3. దర్శక రత్న అనే పేరుకు పరిపూర్ణత చేకూర్చినవాడు, ఎన్నో విలక్షణమైన చిత్రరాజాలకు తెలుగు సినిమా ప్రేమికులకు అందించినవాడు దాసరి. ఆయన కన్నుమూయడం విషాదమే అయినా, ఎంతటివారైనా పోవాల్సిందే అనే నిజాన్ని గుర్తు చేసుకుంటూ, సినిమాకు సంబంధించి ఆయన సూత్రీకరించుకున్న విషయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువ సినీ రచయితలు, దర్శకులు, నటులు ఎదగాలని ఆశిద్దాం.

 4. Lion King గారు,
  క్లుప్తంగా, సూటిగా, పొగడ్తలకి దూరంగా జీవితానికి దగ్గిరగా బాగుంది ఈ నివాళి.
  మద్రాసు సెంట్రల్ లో షర్ట్ లేకుండా దిగిన మగవాడు. దాసరి పేరు లేకుండా ఒక మబ్బు లోగోతో తన సినిమాలకి ప్రచారం చేసుకున్నవాడు దాసరి.

 5. I see your website needs some fresh content. Writing manually
  takes a lot of time, but there is tool for this time
  consuming task, search in google: murgrabia’s tools unlimited content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *