Views:
8

జీవితం ఒక ప్రయాణం. మొదలెట్టిన దగ్గరనుంచీ ముగించే వరకూ. అందుకే రకరకాల పేర్లున్నాయి. జీవనయానం, జీవితనౌక, బ్రతుకుబండి. మరి జీవించేవాడిని నావికుడు, చోదకుడు లేక ప్రయాణికుడు అనవచ్చేమో. నేను విహారి అంటాను.

 


మనందరికీ…. అదే సమస్త జీవజాలానికీ మొదటి మజిలీ ఏంటో తెలుసా….? తల్లి గర్భం. తరువాత తల్లి ఒడి, తండ్రి ఒడి తరువాత మిగిలిన ప్రపంచం. సౌర కుటుంబంలోని గ్రహాలన్నిటిలో భూమి ప్రత్యేకమయినట్లే మనిషి కూడా సకల చరాచరాల మధ్య ప్రత్యేకం.


రెండు కాళ్లమీద నిలబడే సమతౌల్యం, ఆలోచనలు, అభివృద్ధిని కాంక్షించే తత్వం, ఇతర భావోద్వేగాలూ మనిషి ప్రత్యేకతలు.

ఇవి కాసేపు పక్కన పెట్టి కాసేపు మజిలీల దగ్గరకు వద్దాం. ప్రతి ప్రయాణికుడికీ (తిరుగుబోతుకు కూడా) ప్రతీ ప్రయాణం కొత్తగా, ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రయాణాల విధాలు వేరేగా ఉండవచ్చు. నడక, పరుగు, రోడ్డుమీదైతే సైకిల్, మోటార్ సైకిల్, కారు, బస్సు, ఇక రైలు, ఇంకా ఆకాశమార్గం అంటే విమానం, తరువాత అన్నింటిలోకీ ప్రత్యేకమైన సముద్ర మార్గం. తమాషాగా ఉంది కదూ. ఇవన్నీ జీవితానికి అన్వయించుకోవచ్చు కూడా.


అంతేకాకుండా ప్రయాణం స్థోమత దృష్ట్యా దిగువ, మధ్యమ, ఉత్తమ స్థాయిల్లో కూడా ఉండవచ్చు. అదెలా అంటే మన ప్రతి ప్రయాణం విలువ మనకు ఎదురయ్యే మజిలీలను బట్టి నిర్ణయింపబడుతుంది. అంటే ప్రయాణం దిగువ స్థాయిలో ఉన్నా, మజిలీలను బట్టి అనగా మన అనుభవాలు ఎంత గొప్పగా ఉంటే ప్రయాణం అంత విలువైందన్నమాట.


దీన్ని బట్టి చూస్తే మజిలీలు వాటి అనుభవాలు ప్రయాణంలో ఎంత ముఖ్యమైనవో తెలుస్తుంది.


జీవితమూ ఒక ప్రయాణమే కాబట్టి అందులోని అనుభవాలూ అంతే ముఖ్యమైనవి. పుట్టినప్పటినుంచీ మనిషికి…. చచ్చేవరకూ ఎన్నో అనుభవాలుంటాయి.


ఊహ తెలిసినప్పటినుంచీ కొన్ని విషయాలు, అనుభవాలూ మన మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి, కొన్ని ఆనందింపజేస్తాయి, మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి, ఇంకొన్ని గుండె పిండినంత బాధను కలిగిస్తాయి. అవన్నీ విలువైనవే. ప్రయాణంలోని ఎన్నో మజిలీలలో కొన్నింటిని ఎలా మరిచిపోలేమో, జీవనయానంలోని కొన్ని అనుభవాలనూ అలాగే మరిచిపోలేము.

ప్రయాణంలో ప్రతి మజిలీలో మనలాంటి చాలామంది ప్రయాణికులు తారసపడుతుంటారు. కొంతమంది సహ ప్రయాణికులు అవుతారు కూడా. ఉదాహరణకు కన్నవాళ్లు కూడా సహప్రయాణికులే. మనకన్నా ముందు మొదలుపెట్టారు అంతే. తేడా అల్లా మనం వారి దగ్గరనుంచీ మన ప్రయాణాన్ని మొదలు పెడతాము. వాళ్ళు అప్పటికే కొంతదూరం ప్రయాణం చేసి అనుభవాన్ని గడించి ఉంటారు. తరువాత అక్కా చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు, భార్య (ప్రియురాలు). మనమెలా ప్రయాణం ప్రారంభించామో అలానే జీవనాన్ని మొదలుపెట్టే పిల్లలు, ఇలా చాలామంది, స్నేహితులు, చేదువు నేర్పే ఉపాధ్యాయులూ, సహోద్యోగులు కూడా సహ ప్రయాణికులే.


వీళ్ళంతా మనపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రభావం చూపుతారు. జీవితం మొత్తం మీద వీరి ప్రభావం ఉంటుంది.


ప్రతి మనిషి జీవితంలోనూ ఉండే చిన్న హేతువు ఇది. కొంచెం గజిబిజిగా కనిపించినా ఇది చాలా మామూలు విషయమే.

అందుకే అన్నారు “జీవితం చాలా సరళమైనది, మనమే దాన్ని సంక్లిష్టం చేసుకుంటాం” అని.


మన వ్యవహార సరళి, పరిస్థితులను ఆకళింపు చేసుకునే తత్వం పై ఆధారపడి జీవితం మనకు సాక్షాత్కారమవుతుంది.

One thought on “ప్రయాణాలూ-మజిలీలూ”

  1. “మన వ్యవహార సరళి, పరిస్థితులను ఆకళింపు చేసుకునే తత్వం పై ఆధారపడి జీవితం మనకు సాక్షాత్కారమవుతుంది” -ఇది మాత్రం అక్షర సత్యం యజ్ఞా! వ్యాసం బాగుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *