chlapathi rao derogatory comments on girls
Views:
10

 

ఉపోద్ఘాతం

నోరుంటే అది వీపును కాస్తుంది అన్నాడు ఒక పెద్దాయన.

దీని గురించి ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం. ఒకానొక రాజు, ఆయనకో అందమైన రోజా పూల తోట. ఒక చిన్నపిల్లాడు ఆ తోటలో రోజాపూలను చూసి ముచ్చట పడ్డాడు. ఒకానొక రోజు ఒక చిన్న బుట్ట పట్టుకుని రాజుగారి రోజాపూల తోటలోకి దొంగతనంగా చొరబడ్డాడు. చక్కగా విరిసిన కొన్ని పూలను కోసుకుంటూ ఉండగా కాపలా కాస్తున్న సైనికులు ఆ పిల్లవాడిని గమనించారు. గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి పూలు కోసుకుంటున్న పిల్లాడిని పట్టేసుకున్నారు. రాజుగారి దర్బారుకు తీసుకువెళ్తుండగా ఆ పిల్లవాడి నాన్నకు విషయం తెలిసింది. అతను ఆదరాబాదరాగా పరుగెత్తుతూ వచ్చి సైనికులను, “పిల్లవాడు తెలీక తప్పు చేసాడు, వదిలెయ్యండి”, అని ప్రాధేయపడ్డాడు.

సైనికులు అతని మాటలు వినకుండా ఆ పిల్లవాడిని లాక్కెళ్ళిపోసాగారు. అప్పుడు ఆ తండ్రి పిల్లవాడి దగ్గరకు వచ్చి, “ఒరేయ్…! నీకేగనక నోరుంటే అది వీపును కాస్తుంది”, అని చెప్పి ఇక చేసేదేం లేదని ఇంటికి వెళ్ళిపోయాడు.

సైనికులు ఆ పిల్లవాడిని రాజు దగ్గరికి తీసుకుపోయారు. పిల్లవాడు చేసిన దొంగతనాన్ని గురించి చెప్పారు. తీరా చూస్తే బుట్టలో పూలు లేవు. పిల్లవాడిని అడిగితే అమాయకంగా ముఖం పెట్టి నాకేమీ తెలియదని రాజుగారి దగ్గర వాపోయాడు. చేసేదేమీ లేక పిల్లాడిని రాజు వదిలెయ్యమని చెప్పి, ఆ పైన సైనికులను మందలించాడు. పిల్లవాడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు.

ఆనందపడిపోయిన తండ్రి అసలేం జరిగిందని పిల్లవాడిని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు ఇలా సమాధానమిచ్చాడు, “నువ్వే చెప్పావు కదా నాన్నా, నాకేగనక నోరుంటే అది నా వీపును కాస్తుంది అని. సైనికులు నన్ను రాజదర్బారుకు తీసుకువెళుతుండగానే వాళ్ళు చూడకుండా ఒక్కో రోజా పూవును తినేసాను. రాజుగారి దగ్గరకు వెళ్లేసరికి బుట్టలో రోజాపూలు అయిపోయాయి. దాంతో రాజుగారు వదిలేసారు” అని.

ఈ కథలోని నీతి ఏమిటంటే నోటిని సరిగా ఉపయోగిస్తే అది మనల్ని రక్షిస్తుందని. ఇక్కడ నోరు అంటే అసలుకు మాట అనే అర్థం వస్తుంది. కానీ పిల్లవాడు సమయానికి తగ్గట్టుగా నోటిని వాడి తనను తాను రక్షించుకున్నాడు. అలాగని దొంగతనం చెయ్యడం తప్పు కాదా అంటే తప్పే. అది పిల్లాడి తెలివి.

కొనసాగింపు

పైన చెప్పుకున్న కథలో పిల్లాడికి ఉన్న తెలివి లేకపోయింది కొందరు “పురుష”పుంగవులకు. జనంలో తమకున్న పరపతిని, తాము ఉన్న బాధ్యతాయుత స్థానాన్ని మరిచిపోయి నోటికొచ్చింది వాగుతున్నారు. ఇలాగే రాజకీయనాయకుడిగా రూపాంతరం చెందిన ఒక పెద్ద నటుడు, బాలకృష్ణ, ‘అందమైన ఆడపిల్లను చూస్తె ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేసెయ్యాలి’ అంటూ ఒక వేదికపై కారు కూతలు కూశాడు, ‘నేను చూడని లోతుల్లేవు, ఎక్కని ఎత్తుల్లేవు’ అంటూ ఇంకో డైలాగు కూడా వినిపించింది. గిల్లడం, పొడవడం ఆయన లక్షణాలట. చాలా పేరున్న ఇంకో కామెడీ నటుడు, ‘ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళిపోతావా’ అంటూ మాట తూలాడు. ఇంకోసారి అదే నటుడు ఒక హీరోయిన్ శరీర భాగాన్ని విజయవాడ బెంజ్ సర్కిల్ తో పోలుస్తూ అనవసర వ్యాఖ్యలు చేసాడు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా తక్కువేం తినలేదు. ‘కారు షెడ్ లో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి’ అంటూ వ్యాఖ్య చేసి దొరికిపోయాడు.

ఇప్పుడు తిరిగి అదే సంఘటన పునరావృతం అయ్యింది. పాతతరం నటుడు, ఇప్పటికీ సినిమాల్లో అడపాదడపా చిన్న వేషాలు వేసుకుంటున్న చలపతి రావు, నాగార్జున కుమారుడైన, నాగ చైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మాట దొర్లాడు. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా?’ అంటూ ప్రోగ్రాం యాంకర్ వేసిన ప్రశ్నకు, ‘అమ్మాయిలు హానికరమో లేదో తెలీదుగానీ, పక్కలోకి పనికొస్తారు’ అంటూ పేలాడు. ఆ కార్యక్రమంలోని ఇంకో యాంకర్ రవి, ‘సూపర్ డైలాగ్’ అంటూ సిగ్గు లేకుండా మెచ్చుకున్నాడు. ఇంకేముంది ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆడియో ఫంక్షన్లో మహిళలు, ఆడపిల్లలకు కోపం ఎందుకు రాలేదో తెలీదు గానీ, సోషల్ మీడియాలో వీడియోలు చూసినవారందరూ ఆ అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు కోపంతో మండిపడ్డారు. మరుసటిరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదయ్యింది. ఇలాగే ఇంతకుముందు కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ లో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో నోరుజారి క్షమాపణ కూడా చెప్పాడు. రెండోసారి కూడా ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో, ఇక క్షమించేది లేదని వివిధ మహిళా సంఘాలు మండిపడ్డాయి.

 

విశ్లేషణ

ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, సినిమా, ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా. ఏ రకమైన ప్రసారమాధ్యమం అయినా చాలా శక్తివంతమైనది. చీమ చిటుక్కుమన్నా అది సోషల్ మీడియాలో కొద్ది నిముషాల వ్యవధిలో ప్రచారమైపోతోంది. అటువంటి సమాజంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పేరున్న వాళ్ళు, నటులు, రాజకీయ నాయకులు, కొద్దిగా నోటిని అదుపులో పెట్టుకుని ఏం మాట్లాడాలో తెలుసుకుని, ఎరుకతో, జాగ్రత్తతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమాజానికి, కుటుంబ వ్యవస్థకు వెన్నెముక లాంటి స్త్రీత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇక మీడియా విషయానికి వస్తే మాధ్యమాలకు సంబంధించి, Give people what they want, అంటే జనాలకు కావాల్సింది ఇచ్చేయండి, అనే మొదటి సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నట్టుంది. ఈ సూత్రం ఇన్ని రకాల మాధ్యమాలు లేని కాలంలో చక్కగా వర్తించేదేమో. ఇప్పుడు మాత్రం ఈ సూత్రాన్ని ఈ రకంగా మార్చవలసిన అవసరం వచ్చింది, ‘Give people what they need’, అంటే జనాలకు అవసరమైనది ఇవ్వండి అని. పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయ స్వేచ్ఛ, ఈ పదాల పవిత్రత దాదాపు మట్టిలో కలిసిపోయిన తరుణం ఇది. సత్యశోధన, నిజనిర్ధారణలను నిష్పక్షపాతంగా, నిర్భీతిగా, నిక్కచ్చిగా చేసే పాత్రికేయులు కేవలం వేళ్ళమీద లేక్కబెట్టే సంఖ్యల్లో ఉన్నారివాళ. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.

ఇక నాణానికి రెండోవైపు చూద్దాం. ఈ వైపున ఉన్నది జనాలు. మీడియా ఏది చూపిస్తే అది జనాలు చూస్తున్నారా లేక తమకు ఇష్టమై చూస్తున్నారా అనేది అసలు సమస్య. ఈ సమస్య గురించి ఆలోచించడం అంత సులువు కాదు. మీడియా కేవలం కొన్ని సంస్థలకు సంబంధించిన విషయం, అదే జనాల దగ్గరికి వస్తే మాత్రం అన్నీ తారుమారై పోతున్నాయి. ద్వితీయార్థాలు, సులువుగా చెప్పాలంటే డబల్ మీనింగులు. ఇవి దండిగా ఉన్న సినిమాలూ, కార్యక్రమాలూ జనబాహుళ్యం ఆదరణ చక్కగా పొందుతున్నాయి. అంటే జనాలు బూతును ఆదరిస్తున్నారని పచ్చిగా చెప్పాల్సివస్తుంది. తేడా వెంట్రుక వాసి స్థాయిలో ఉంది. ఏమైనా మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి. అటూ ఇటూ కానీ ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉంది ఈ వేళ.

ఇక అసలు విషయానికి వద్దాం. ఒక పెద్ద నటుడు, అంతమంది జనం ఉన్న ఒక కార్యక్రమంలో, అమ్మాయిలు పక్కలోకి బాగా పనికొస్తారు అన్నాడంటే ఆ ధైర్యం, సిగ్గులేనితనం ఎక్కడినుంచీ వచ్చిందని. జనాలు చక్కగా నవ్వడం చూస్తుంటే, ఇటువంటి మాటల్ని జనం ఆస్వాదించి నవ్వగలుగుతున్నారా అని అమితాశ్చర్యం. మీడియా వేగానికి తోడు, ఇటువంటి జగుప్సాకరమైన మాటలు, వెరసి పుచ్చిపోతున్న వ్యవస్థ. ఇదెక్కడికి దారితీస్తుందో, అనంతర పరిణామాలు ఎలా ఉంటాయోనన్న భయాలూ, అనుమానాలూ కలుగుతున్నాయి. మహిళలతో పాటు పురుషలోకం కూడా చలపతి రావు వ్యాఖ్యల్ని నిర్ద్వందంగా ఖండించడం తప్పకుండా ఆనందించాల్సిన విషయం.

ముగింపు

ఏది ఏమైనా అంతర్గతంగా యువతలో సంఘర్షణ, యుద్ధం మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఊపులోనే ఒక ఉద్యమం పురుడుపోసుకోవాలి. స్త్రీ పురుషుల ప్రాధాన్యతను, ఇరువురి అస్తిత్వ గొప్పదనాన్ని గుర్తించి, నేటి యువత వివక్షకు వ్యతిరేకంగా పోరాడగలరని చిన్న ఆశ. ఈ నిప్పు ఇప్పటికీ వెలిగి వెలిగి ఆరిపోతూ ఉండవచ్చు, కానీ తప్పకుండా కాష్టమై నాలుకలు కాల్చేస్తుంది.

 

కొసమెరుపు

నోరుంటే వీపును కాస్తుంది అన్నది ఎంత నిజమో, అదే నోరు అనవసరంగా పెగిలితే వీపు విమానం మోత మోగుతుంది అన్నది కూడా అంతే నిజం. ఇది నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.

2 thoughts on “ఔరా ఎంతటి వాచాలత”

  1. కొందరి విషయంలో “ఈ వెధవల్ని ఎందుకు కన్నామా?” అని తల్లులు సిగ్గుతో చితికిపోతారు. “కళ్లు, వళ్లు మొత్తం కామంతో నిండిన కొవ్వు పట్టిన వదరుబోతు మొగుడయ్యాడే ఏమిటీ ఖర్మ?” అని కట్టుకున్న ఇళ్లాళ్లు ఈసడించుకుంటారు. “వీళ్లు మా అన్నదమ్ముళ్లని చెప్పుకుంటే పరువు ఏంకావాలి?” అని అప్పజెళ్ళెళ్లు పరితపించి పోతారు. అయినా ఈ వెధవదద్దమ్మలు మారరు. మైకు దొరగ్గానే మదమరించిపోతారు. అయితే ఇలాంటి దౌర్భాగ్యులను అభిమానించే, సమర్ధించే, చప్పట్లు చరిచే గుంపొకటుంది. ఆ గుంపు “పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా!” అన్న చందంగా వ్యవహరిస్తుంది. ఈ చవటల తోపాటు ఆ గుంపుకూ బడితెపూజ అవసరం..

  2. చలపతిరావు ఆ మాట అనగానే అక్కడ వున్న సన్నాసుల్లో ఒక్కడయినా, లేదా ఒక్కతయినా లేచి వాడిని బండబూతులు తిట్టలేదంటే అక్కడున్నవాళ్ళు వీడికంటే తక్కువేమీ కాదన్న విషయం మనకి బోధపడడంలేదా? ముందు వాళ్ళని పట్టుకుని బూతులు తిట్టాలి. ఒక్కడయినా, లేదా ఒక్కతయినా నిరసన వ్యక్తంచేసి అక్కడనుండి వెళ్ళిపోలేదంటే వాళ్ళదెంత దున్నపోతు చర్మమో కదా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *