Views:
0

ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఇద్దరు వృద్ధ దంపతులను తల్వార్‌లతో బెదిరించి, బంధించి వారి ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు నగలను, ఒక డైమండ్‌ రింగ్‌, సెల్‌ఫోన్‌లను గుర్తు తెలియని దుండగులు ఆదివారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని వృద్ధ మహిళ బంధువులకు, పోలీసులకు తెలిపింది. వెంటనే ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ గౌస్‌ మొయునుద్దీన్, సీఐ వెంకటేశ్వర్లు, క్లూస్‌టీమ్‌ సిబ్బంది, క్రైమ్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. రేతిబౌలి పీవీఎక్స్‌ప్రెస్‌ పిల్లర్‌ నెంబర్‌ 35 వద్ద మాపార్‌ పెరల్‌ అపార్ట్‌మెంట్‌లో 304 ఫ్లాట్‌లో జాఫర్‌ (66), అతని భార్య ఫాతిమా (60) కూతురుతో కలిసి నివసిస్తున్నారు.

ఆదివారం ఉదయం కూతురు పనిమీద బయటకు వెళ్లింది. ఇదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగలు తల్వార్‌లతో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి వృద్ధ దంపతులు ఉండే ఫ్లాట్‌ తలుపులు తట్టారు. వృద్ధ మహిళ ఫాతిమా తలుపులు తెరవగానే తల్వార్‌లతో ఆమెను బెదిరించి, తాడుతో కాళ్లు, చేతులు, వస్త్రాలతో మూతిని కట్టేశారు. ఫాతిమా భర్త జాఫర్‌ అనారోగ్యంతో ఉండడంతో అతను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు.

దీన్ని ఆసరగా చేసుకున్న దుండగులు వృద్ధ మహిళను తల్వార్‌లతో బెదిరించి ఆరు తులాల బంగారు నగలు, ఒక డైమండ్‌ రింగ్‌, సెల్‌ఫోన్‌లతో ఉడాయించారు. దీంతో వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *