Views:
2

శీర్షిక

సమయానికి తగుమాటలాడటం తప్పుకాదు బాబూ!

పదుగురి నోళ్ల్లల్లో నానుతున్న అంశం: “గూండాగిరి – పసిప్రాణం బలి!!”

*********

నాన్నా నన్ను కాపాడవూ…?

ఒక పసిప్రాణం నేలరాలిపోయింది. తను తన తండ్రితో పంచుకున్న ఆవేదన అంతా పోయిన ప్రాణంతో పాటు గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు ఎవరు ఏం చేసినా ఆ చిన్నారి తిరిగిరాదు. నాన్నా నన్ను కాపాడవూ అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ వేడుకుంది. అయినా ఆ తండ్రి హృదయం కరగలేదు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి కోసం కన్నతల్లి పడని కష్టం లేదు. చివరికి ఇల్లు అమ్మి వైద్యం చేయించాలనుకుంటే తండ్రి అడ్డుపడ్డాడట. పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా లేక జలుబో జ్వరమో వచ్చినా తల్లిదండ్రులు ఆందోళనపడిపోయి డాక్టరు దగ్గరికి పరుగెత్తుతారు. వాళ్ళు మామూలుగా లేచి తిరిగేవరకూ కంటికి నిద్రకూడా ఉండదు. అలాంటిది నాన్నా నన్ను రక్షించవూ అంటూ కన్నీళ్ళతో వేడుకున్నా వీసమెత్తు కదలిక లేదా తండ్రిలో. తన తండ్రికి పంపిన వీడియోలో ఆ చిన్నపిల్ల, “నాన్నా! నిన్ను చూడాలని ఉంది, స్కూలుకు వెళ్లి స్నేహితులను కలవాలని ఉంది, నన్ను బతికించు” అంటూ కన్నీళ్ళతో చెప్పిన మాటలు వింటే ఎంతటి పాషాణ హృదయమైనా కరిగిపోతుంది. కానీ ఆ కసాయి తండ్రి స్వార్ధం, ఆస్తిపై వ్యామోహం కన్నబిడ్డ ప్రాణాన్ని బలిగొంది. ఇంకేం చేస్తాం? ఏముంది చెయ్యడానికి? ఇది ఇప్పుడు కేవలం వార్తగా మిగిలిపోయింది.

 

గూండాగిరీ ఖరీదు ఒక పసిప్రాణం

పన్నెండేళ్ళ వయసు, జీవితాన్ని చూడని పసితనం, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నా బతికి చదువుకోవాలని, స్నేహితులతో కలిసి హాయిగా ఆడుకోవాలని, నాన్నను చూడాలని ఆశ, వెరసి విజయవాడలో వైద్యానికి డబ్బు లేక ప్రాణాలు కోల్పోయిన సాయి శ్రీ. సాయిశ్రీ పేరుతో ఉన్న ఇంటిని వైద్యం కోసం అమ్మేద్దామనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్.ఎల్.ఎ బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు అమ్మకుండా అడ్డుకున్నారని సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయి తండ్రి మాదంశెట్టి శివకుమార్ తమకు ఇల్లు అమ్మేసాడని, ఆ ఇంట్లో ఉండడం కుదరదని బయటకు తరిమేశారని తల్లి ఆవేదన. కూతురి వైద్యానికి పాటుపడాల్సిన తండ్రే ఆస్తికోసం పన్నాగం పన్ని ఇంటిమీదకు గూండాలను పంపించినట్టు వచ్చిన వార్త ఈ కాలపు బలహీనమైన మానవసంబంధాలకు అద్దంపడుతుంది. పాపతల్లి సుమశ్రీ ఈ విషయమై మానవహక్కుల సంఘానికి పిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన మానవహక్కుల సంఘం సంబంధితులకు నోటీసులు జారీ చేసింది.  ఇది నిజమైన పక్షంలో ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు. కాపాడాల్సిన కన్నతండ్రే తన కూతురి పాలిట కాలయముడైతే ఇక దిక్కెవరు?

 

ఉపసంహారం:- దుష్ట రాజకీయ గూండాల అండతో కాపాడవలసిన తండ్రి కాలనాగై కాటువేయడం అమానవీయం. అమానుషం. కరుడుగట్టిన గూండాలు కూడా పసిపిల్లల పట్ల, అసహాయ అబలల పట్ల జాలి చూపిస్తారు. కానీ కొందరు పరమపాతకపు నికృష్టులు, భ్రష్టులు ఎంతటి పాతకానికైనా ఒడికడ్తారు. హిరణ్యకశిపుడు, నరకాసురుడు లాంటి వారు కూడా వీరి ముందు బలాదూర్. రాక్షసులు సిగ్గుపడే దాష్టీకం ఇది.

.

-వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

15.05,2017 – సోమవారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *