Views:
5

శీర్షిక

సమయానికి తగుమాటలాడటం తప్పుకాదు బాబూ! 

 పదుగురి నోళ్ల్లల్లో నానుతున్న అంశం: “మించినవారు కలరె ధరణిన్!?” 

*********

క్రింద చెప్పబోతున్న కథ కట్టుకథ లేక పిట్టకథ కాదు. మా ఊర్లో నిజంగా జరిగిన ఓ వ్యక్తి కథ:-

 

“డంబాలరాయుడికి జంబాలు ఎక్కువ”

నా చిన్నతనంలో (45 ఏండ్ల క్రితం) మా ఊరిలో ధనుంజయరాయుడు అనే అతను రాజకీయనాయకుల వెంట  జులాయి తిరుగుళ్లు తిరుగుతూ ఉండేవాడు. ప్రతిపనికి తానే అన్నట్లు ముందుండేవాడు. కన్యాశుల్కంలో గిరీశంలా కాదు, అంతకంటే ఓ పిసరు వదరబోతుతనం, వెధవాయిత్వం ఎక్కువే. అడగకున్నా అన్ని కార్యాల్లో జొరబడేవాడు. పనిచెడిందంటే నెపం ఇతరుల మీదకు సునాయాసంగా త్రోసివేసేవాడు.  ఫలితం దక్కిందంటే అంతా తన ఘనతే అని డప్పు వేసుకునేవాడు. “అందుకు మూలం నేనే, ఇందుకు కారణం నేనే, అతన్ని మంత్రిని చేసింది నేనే, ఇతన్ని కలక్టర్ని చేసింది నేనే” ఇలాటి చాంతాడు వాగుళ్లకు కొలతలుండేవి కావు.    అందుకే అతని నిజ నామామధేయాన్ని మరచిపోయిన జనం ‘జంబాలకారి డంబాలరాయుడు’ అని పిలిచేవారు. ఎందరెంత ‘ఛీ’కొట్టినా, ఎన్ని చీవాట్లు పెట్టినా, చివరకు మొఖంమీద ఉమ్మేసినా సరే కాటికి పోయేదాకా అతని తీరు మారలేదు. అతనుచచ్చిన తర్వాత కూడా ఎవడైనా లేని ఢాంభికాలకు పోయినప్పుడు, చుట్టిచుట్టి అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పిప్పుడు ధనంజయరాయుడు ఉరఫ్ డంబాలరాయుడునే పోల్చి చెప్పుకుంటారు. అతను ఇలా కీర్తిశేషుడిగా మిగిలిపోయాడు.

 -ఈ కథకు, మనం ముచ్చటించబోయే విషయానికి సంబంధం ఉందోలేదో నాకు తెలియదు కానీ,  నేటి అంశం గురించి వ్రాయడం మొదలు పెట్టగానే మా ఊరి ‘జంబాలకారి డంబాలరాయుడు’ గుర్తుకొచ్చాడు. 

“అమెరికా పర్యటనపై ఆం.ప్ర. ముఖ్యమంత్రి వెల్లడించిన విషయాలు”

అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ‘నాచంబానా’ ఆ విశేషాలను వెలగపూడి సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ముచ్చటించారు. ఆ విశేషాలేమిటో చూద్దాం.

  • -నేను చెప్పబట్టి ప్రవాసులు పారిశ్రామికవేత్తలయ్యారు
  • -వారిని ఎదగమని చెప్పింది నేనే
  • -నా మాటమీద ఎదిగారు కాబట్టి నా వాటా రాయల్టీ కట్టాలని అడిగా
  •  -అమెరికా యూనివర్సిటీలు పీహెచ్ డీలు ఇస్తామన్నాయి, నేనే వద్దన్నా 
  • -స్నానం కూడా మానుకుని అమెరికా అంతా తిరిగా 
  • -అమెరికా తిరిగి 28 ఒప్పందాలు చేసుకొచ్చా 

గత కొద్ది రోజులు అమెరికాలో సుడిగాలి పర్యటన చేశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘నాచంబానా’. తిరిగివచ్చిన తర్వాత సచివాలయంలో మాట్లాడుతూ అక్కడి విశేషాలు చెప్పాడు. తన ప్రోత్సాహం వల్లే సాంకేతిక నిపుణులుగా అమెరికా వెళ్ళినవాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని అన్నాడు. తన మాట ప్రాతిపదికగా వారు ఎదిగారు కాబట్టి వారి సంపాదనలో తనకు వాటా ఉందని, దానికి రాయల్టీ చెల్లించాలని కూడా అడిగినట్టు ఆయన చెప్పాడు. 28 కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకున్నామని వెల్లడించాడు. ఒప్పందాల విశేషాలు చెబుతూ సౌర విద్యుత్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెస్లా కంపెనీతో చర్చలు జరిగాయని, ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ద్వారా స్మార్ట్ గ్రిడ్ లు ప్రతి గ్రామంలో నెలకొల్పడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. తద్వారా విద్యుత్తు చార్జీలు భారీగా తగ్గుతాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టుల ఖర్చు తగ్గుతుందని ఆయన అన్నాడు. 

 

యూ.ఎస్.ఐ.బీ.సి (యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్)వారు తన కోసమే మోస్ట్ ట్రాన్స్ఫర్మేటివ్ సీఎం అవార్డును సృష్టించి తనకు ప్రదానం చేశారని ‘నాచంబానా’ అన్నాడు. అవార్డులు, డాక్టరేట్లు తీసుకోవడం తనకు ఇష్టం లేకపోయినా ఆ గుర్తింపు వల్ల ఇంకా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్వీకరించక తప్పట్లేదన్నాడు. ఇంకా కొన్ని అమెరికా యూనివర్సిటీలు పీ.హెచ్.డీలు ఇస్తామన్నా వద్దన్నానని ఆయన చెప్పాడు. 

భారత దేశంలో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, అధునాతనంగా అభివృద్ధి చెందిన జపాన్, సింగపూర్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల సరసన చేరితే అంతకంటే కావలసిందేముంది. ఇదే గనక చెప్పింది చెప్పినట్టు జరిగితే ఆంధ్రులమని సగౌరవంగా తలెత్తుకు నిలబడతాము. కాబట్టి రాష్ట్రానికి ‘నిజమైన’ ప్రాజెక్టులు రావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచపటంలో అభివృద్ధి వెలుగుదివ్వె కావాలని ఆశిద్దాం. కానీ ఇవన్నీ కేవలం కబుర్లైతే మాత్రం, పైన మనం చెప్పుకున్న ‘జంబాలకారి డంబాలరాయుడు’గా చరిత్రలో మిగిలిపోవడం తథ్యం. జనాలకు కోపం వస్తే ప్రాజెక్టుల ఖర్చు తగ్గటం అటుంచి ఎన్నికల ఖర్చు ఎక్కువవుతుంది.

 ఉపసంహారం:- మనం ఎంత ‘నిప్పు’ అయినప్పటికీ, ఎన్ని ఘనకార్యాలు సాధించినప్పటికీ మనల్ని మనమే కీర్తించుకుని, స్వోత్కర్షతో వృషణాయాసం పడితే ఫలితం ఏమీ ఉండదు. మన ఘనతను ఇతరులు గుర్తించి కీర్తించినపుడే ఆ గొప్పతనం ద్విగుణీకృతమవుతుంది. లేనప్పుడు అంతా ‘తుప్పు’ కిందే లెక్క. 

One thought on “మించినవారు కలరె ధరణిన్!?”

  1. రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా కూడా చాలామంది చాలా చోట్ల తానూ లేకపోతె అసలు కోడి కూయాడు అని వాళ్ళున్నారు కాబట్టే మనం బతికి బట్ట కడుతున్నాం అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు ఎవరు లేకపోయినా ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. ఈ నిజం ఎవరికీ రుచించదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *