Views:
8

శీర్షిక

సమయానికి తగుమాటలాడటం తప్పుకాదు బాబూ!

పదుగురి నోళ్ల్లల్లో నానుతున్న అంశం: “సాగు ఆదాయం పైనా పన్ను వేద్దామా!?”
*********

వ్యవసాయంతో సంబంధం లేని వారంతా తమ ఆదాయంలో వ్యవసాయ ఆదాయాన్ని చూపుతుండటంతో అలాంటి వారిపై దృష్టి పెట్టాలని నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. అలాగే పన్ను సంస్కరణల్లో భాగంగా ‘వ్యవసాయంపై పన్ను మినహాయింపుల’పై దృష్టిపెట్టాలని గవర్నింగ్ కౌన్సిల్ ప్రతిపాదించిన మూడేళ్ల యాక్షన్ అజెండా ముసాయిదాలో పేర్కొంది.

దీనిపై స్పందిస్తూ ‘వ్యవసాయానికి సంబంధించిన ఆదాయంపై పన్ను విధించాలి’ అన్న అంశం పై చర్చించాలన్న ప్రధాని మోదీ.

పలు మీడియాల్లో దీనిపై నిరసన చర్చ మొదలు కావడంతో-

“వ్యవసాయానికి సంబంధించిన ఆదాయంపై పన్ను విధించే యోచన కేంద్రానికి లేదు” అని కేంద్ర ఆర్ధికశాఖామాత్యులు అరుణ్ జైట్లీ ప్రకటన.

తె.రా.స ఆవిర్భావసభలో ఎకరానికి రెండుసార్లు, రెండు పంటలకు రూ.4,000లు వంతున సంవత్సరానికి ఒక ఎకరానికి రూ.8,000లు ఎన్నిఎకరాలుంటే అన్ని ఎకరాలకు ప్రతి రైతుకు పంటసాయం అందిస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి ‘కచంశేరా’ వరాలు కురిపించాడు.

ఆంధ్రుల కలల రాజథాని (?) అమరావతి నిర్మాణానికి ఆ చుట్టుపక్కల; పరిశ్రమలు, ఓడరేవులు, విమానాశ్రయాలు అంటూ రాష్ట్రమంతటా ‘లాండ్ పూలింగ్ లేదా పుల్లింగ్’ పేరిట సాగుభూములను లాక్కోవడంపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, రైతులు దర్నాలు చేస్తున్నా వేలకువేల పచ్చని పంటపొలాలను అవసరాలకు మించి రెట్టింపు/నాలుగింతల సంఖ్యలో స్వాధీనం చేసుకో ప్రయత్నిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘నాచంబానా’.

-ఇవి రైతుల భూములకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు చేస్తున్న ప్రహసనాలు.

వెన్నెముకకు వెన్నుపోటు:-

భారతదేశ సాంస్కృతిక సుస్థిరతకు వెన్నెముక పల్లె. పల్లెకు కాపు, కావడి, కావలి వ్యవసాయదారుడు. అతనే ‘రైతన్న’ ‘అన్నదాత’ ‘జై కిసాన్’ అని దేశం ముద్దుగా పిలుచుకునే వ్యక్తి. నిర్మాణాత్మక శక్తి.

అతని పేరిట “వ్యవసాయ దారుల దినోత్సవం” అనే దినం (డీసెంబర్-23 కిసాన్ దివస్) ఉందని కూడా ఎనభై శాతం మంది రైతులకు తెలియనే తెలియదు. దేశంలో దాదాపు మూడింట రెండొంతుల మంది వ్యవసాయము మరియు వ్యవాసాయ సంబంధిత వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నా- సినిమావాళ్ల, రాజకీయ నాయకుల దినాలకు, ఇంకెన్నోఇతర దినాలకు మన దినపత్రిలు ప్రత్యేక శీర్షికలతో, వార్తా టివి గొట్టాలు విశేష కార్యక్రమాలతో హంగామా చేస్తాయి కానీ, రైతుల దినం గురించి ఒక్క ముక్క చెప్తే అదే గొప్ప.

ఆర్ధిక సంస్కరణల ముసుగులో ప్రవేశపెట్టిన నూతన విత్తన విధానం- సొంత విత్తనాలు వాడుకునే రైతుల హక్కులను పరిపరి రూపాల్లో హరిస్తోంది. కల్తీ విత్తనాలతో రైతు కుదేలై పోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవు. ఇకసాగునీరు త్రాగు నీటి కంటే ఖరీదయ్యే పరిస్థితి దాపురించింది. చేతికందబోయే పంట మలమల ఎండుతున్నా నీళ్లునములుతారే కానీ చిలకరించరు, పలకరించరు. ఈమధ్య ఆం.ప్ర.లో రెయిన్ గన్ల భాగోతం ఒకటినడిచింది. దానివల్ల కావలసిన వారికి కమీషన్లు దక్కాయేమోగానీ పంటలు తడిబారలేదు. రైతు కన్నీళ్లు ఆగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు వెతలకు, కథలకు అంతే ఉండదు. ఇదీ, నేటి మన రైతు భారతం. గోరుచుట్టుపై రోకటి పోటులా మర్లా పన్ను పోటుపై చర్చలు, చట్టుబండలూనా!?

తెల్లదుప్పటి కప్పిన వేళ:-

పాలకులు వాగ్దానాలు వెళ్ల కక్కుతారు.
ప్రతిపక్షం మీ వెంటే మేమంటారు.
వక్తలు ఉపన్యాసాలు వల్లె వేస్తారు.
మీడియా మొక్కుబడిగా ముక్కుతుంది.
నిపుణులు సలహాలు ఇస్తూనే ఉంటారు.
ప్రభుత్వాలు కమిటీలు వేస్తూనే ఉంటాయి.
-అయినా, ప్రక్కనే ఎక్కడో ఒక అన్నదాత ఇంట మరో అర్ధాంతపు చావుమేళం వినపడుతూనే ఉంటుంది.

హక్కూలేదు – దిక్కూలేదు:-

మూడు సెకన్లు, నిముషాలు లోపున ఉత్పత్తి అయ్యే బ్లేడుకు, బిస్కత్తుకు ధరను తయారీదారుడు దర్జాగా నిర్ణయించుకుంటాడు.

మూడునెలలకు పైబడి, సంవత్సరాల తరబడి సాగుచేసి పండించే పంటకు మాత్రం ధర నిర్ణయించుకునే హక్కు రైతు చేతిలో ఉండదు. దళారీల దయ, ప్రభుత్వ భిక్షం మీద ఆధారపడి అగచాట్లు పడాలి. ఈ అన్యాయాలకు తెర పడనంత కాలం రైతు బాగుపడడు. నీతి అయోగ్ అయినా, జాతీయ ప్రభుత్వమైనా ముందు ఆదిశగా ఆలో చించండి. రైతు సుసంపన్నుడయ్యాక అందరం పన్నుల గురించి ఆలోచిద్దాం.

ఉపసంహారం:- చిత్తశుద్ధి, ధర్మ నిరతి కలిగిన నిజమైన రైతు బాంధవుడు రాజ్యాధికారానికి వస్తేనే- పల్లెలు పల్లవిస్తాయి. పట్టణాలు చల్లగుంటాయి. అన్నదాత ఆనందిస్తాడు..

-వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి

10.05,2017 – బుధవారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *