Views:
3

శీర్షిక

‘సమయానికి తగుమాటలాడటం తప్పుకాదు బాబూ!’ 

పదుగురి నోళ్ల్లల్లో నానుతున్న అంశం: “దేశాలు తిరిగాము రామాహరీ!!”

*******************

దేశాలు తిరిగాము రామాహరీ!!

దేశదేశాలు తిరిగాము రామాహరీ!!
 
ఫలితమ్ము సూన్యమ్ము రామాహరీ!!
ఫ్లైటు చార్జీలు దండుగయా రామాహరీ!!
 
వస్తాయి వస్తాయి రామాహరీ!!
చాలా ప్రాజెక్టులొస్తాయి రామాహరీ!!
 
మూడేళ్లు తిరిగారు రామాహరీ!!
మూట కరిగించారు రామాహరీ!!
 
మాట ఇచ్చినవారు రామాహరీ!!
బాగ దాటవేస్తున్నారు రామాహరీ!!
 
మరి మళ్లీమళ్లీ వెళ్లి రామాహరీ!!
మీరు ఒరగదోసేదేంది రామాహరీ!!
 
ఫాలో అప్ చేస్తేను రామాహరీ!!
వారు పాటుకొస్తారండి రామాహరీ!!
 
వారొచ్చినా రాకున్న రామాహరీ!!
మీ ఖర్చుతో రాష్ట్రమ్ము రామాహరీ!!
తిరుక్షవరమై పోతోంది రామాహరీ!!

బాగా క్షవరమైపోతోంది రామాహరీ!!

 

-ఈ పేరడీ ఎవరికైనా వర్తిస్తే ‘భుజాలు తముడుకో వచ్చు’. ఏది ఏమైనా గుమ్మడికాయలు (ఛార్టర్డ్ ఫ్లైట్ల ఖర్చులు) తిరిగి రావన్న విషయాన్ని మాత్రం జనం గ్రహించాలి.

 

అమెరికాలో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు బృందం (16మంది) పర్యటన:-

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అమెరికా పర్యటన కొనసాగుతున్నది. తన పర్యటనలో భాగంగా ఆయన పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. కాలిఫోర్నియా గవర్నర్, ఫ్లెక్స్ ట్రాన్సిక్స్ సిఈవోతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లెక్స్ ట్రాన్సిక్స్ సీఈవో మైక్ మెక్ సమరతో ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. ఈ సందర్భంగా తమ పారిశ్రామిక విస్తరణ ప్రణాళికలను మైక్ మెక్ సమర చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు ప్రతిపాదనల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే కాలిఫోర్నియా గవర్నర్ తో భేటీలో అమరావతి సందర్శించి తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు ఆయనను కోరారు. ఈ నెల 11 వరకు కొనసాగే పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్‌, చికాగో వంటి నగరాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు, ప్రవాస తెలుగువారితో సమావేశాలు నిర్వహిస్తారు. భారత్‌, అమెరికా వాణిజ్య మండలి (యుఎస్‌ఐబీసీ) వార్షిక వెస్ట్‌కోస్ట్‌ సమ్మిట్‌-2017 లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ వేదికపై ఆయన ట్రాన్స్‌ఫర్మేటివ్‌ సీఎం పురస్కారాన్ని అందుకోనున్నారు.” -అని అనుకూల మీడియా పొగడ్తలతో ముంచెత్తుతోంది.

 
“యాపిల్ కంపెనీ సి.ఇ.వో ‘జెఫ్ విలియమ్స్’ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి బృందం భేటీ” అని ఒక ఛానల్ స్క్రోలింగ్. ప్రస్తుతం యాపిల్ కంపెనీ సి.ఇ.వో ‘టీమ్ కుక్’ అన్న స్పృహ కూడా ఆ ఛానల్ కు లేకపోవడం ఎంత వింతో? ఈ బృందం పర్యటన కూడా అంతే విడ్డూరంగా సాగుతోంది.
 
ఇప్పటికే భారత “దేశ” ప్రధాని ‘నమో’ తో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ “రాష్ట్ర” ముఖ్యమంత్రి ‘నాచంబానా’ ఈ మూడేళ్లలో అనేక దేశాలు చుట్టి వచ్చాడు. ఇప్పుడు 16 మంది బృందంతో అమెరికాను చుట్టిరానున్నాడు. దేశ ప్రధాని వెంట కూడా ఇంత మార్బలం ఉండదేమో!
 

ప్రతిపక్ష/సోషల్ మీడియా ఈ విషయాన్నే ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు చేసిన పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఒనగూడిన మేలు ఒక్కటీ లేదని విశ్లేషిస్తోంది. ఈ అన్ని మీడియాలను గమనించిన ఏ సామాన్యుడికైనా ఇది “కాశీకి పోయాను రామాహరీ!!” అన్న రేలంగి – గిరిజల పాట చందంగానే ఉంది అనిపించక తప్పదు.

 

ఉపసంహారం:- ముక్కారు పంటచేలను కాంక్రీటు వనాలుగా మార్చడం కంటే స్థానిక మానవ వనరులను, సహజ సంపదలను వినియోగించి కోస్తాను పంటల రాస్తాగా, సుదీర్ఘ తీరప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా మారిస్తే, మనం ఎవరి వెంట పడనక్కర లేదు. మనవెంట పడేందుకు దేశదేశాలు ముందుకు వస్తాయి. ప్రపంచం లోని అనేక తీర ప్రాంతాలు ఎవ్వరిని చేయి చాచకుండా ఈ ఘనతను సాధించాయి. ‘కృషి నాస్తి – ఆర్భాటం జాస్తి’ అయినప్పుడు ఏ ఏతమేసి తోడినా చెరువు నిండదు..

-వేమారెడ్డి మధుసూదన్ రెడ్డి
06.05,2017 – శనివారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *