హైదరాబాద్, 4 సెప్టెంబర్:
హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసులో నాంపల్లి అదనపు సెషన్స్ జడ్జి చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో ఈరోజు తుది తీర్పును వెల్లడించారు.
ఈ జంట పేలుళ్ల కేసులో అరెస్టు అయిన ఐదుగురు ఉగ్రవాదులలో ఇద్దరిని దోషులుగా, మరో ముగ్గురిని నిర్దోషులుగా న్యాయమూర్తి ప్రకటించారు. అనీఖ్ షఫీక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్‌లను దోషులుగా ప్రకటిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
కాగా, 2007, ఆగస్టు 25న సాయంత్రం జరిగిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్లలో 44 మంది మృతి చెందగా, 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల కేసు విచారణ దాదాపు 11 ఏళ్ల పాటు కొనసాగింది. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు సిట్ బృందం తేల్చింది.
అలాగే ఈ పేలుళ్లతో 8 మందికి ప్రమేయం ఉన్నట్లు తెలపగా, వీరిలో అరెస్టయిన ఐదుగురు చర్లపల్లి కారాగారంలో ఉన్నారు. ఈ కేసుతో సంబంధమున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీర్ రెజా ఖాన్ పరారీలో ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ రియాజ్ భత్కల్ పాకిస్తాన్, దుబాయ్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు నిఘా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
మామాట: మరి పరారీలో ఉన్నవాళ్ళు దొరికేదెప్పుడో?