అదిరిపోయే పోరాట పటిమ కనబరిచిన సఫారీలు…

1st Test, Day 3: South Africa 385/8 at stumps
Share Icons:

విశాఖపట్నం: వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతంగా ఆడుతుంది.  తొలి ఇన్నింగ్స్‌లో 34కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌(160: 287 బంతుల్లో 18 ఫోర్లు, 4సిక్సర్లు) ఆదుకున్నాడు. సహచర బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాటపట్టినా ఒంటరిగా పోరాడి జట్టును పటిష్ఠస్థితిలో నిలిపాడు. ఎల్గర్‌ మంచి పునాదివేయడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ అదే స్ఫూర్తితో విజృంభించారు. డుప్లెసిస్‌(55) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో రాణించాడు. డుప్లెసిస్‌ వెనుదిరగడంతో ఎల్గర్‌కు డికాక్‌(111: 163 బంతుల్లో 16ఫోర్లు, 2సిక్సర్లు) తోడయ్యాడు. పరిమిత ఓవర్ల తరహాలో డికాక్‌ బౌండరీలు బాదుతూ అద్భుత శతకం సాధించాడు.

భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆధిపత్యం ప్రదర్శించారు. సంయమనంతో వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టుకు భారీ స్కోరు అందించారు. మూడోరోజు, శుక్రవారం ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 118 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా 8 వికెట్లకు 385 పరుగులు చేసింది. సఫారీలు ఇంకా 117 పరుగుల వెనుకంజలో ఉన్నారు. ముత్తుస్వామి(12), కేశవ్‌ మహరాజ్‌(3) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఐదు వికెట్లతో రాణించగా.. రవీంద్ర జడేజా రెండు, ఇషాంత్‌ శర్మ ఒక వికెట్‌ పడగొట్టారు.

అంతకముందు భారత్ ఓపెనర్లు వీరవిహారం చేయడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ భారీ స్కోరు చేసింది. స్వదేశంలో ఆడిన తొలి టెస్టులోనే మయాంక్‌ అగర్వాల్‌ (371 బంతుల్లో 215; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో మెరువగా.. ఓపెనర్‌ అవతారమెత్తిన రోహిత్‌ శర్మ (244 బంతుల్లో 176; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) కొద్దిలో ఆ చాన్స్‌ మిస్సయ్యాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. టీమ్‌ఇండియా 136 ఓవర్లలో 502/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

ఇక టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెరీర్ లో మరో రికార్డు సాధించాడు. టెస్ట్ క్రికెట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లలో రెండో వాడిగా నిలిచాడు. జడేజా మొత్తం 44 టెస్టు మ్యాచులు ఆడగా, విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచులో ఈ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రవీంద్ర జడేజా కన్నా ముందు అశ్విన్ 37 టెస్టు మ్యాచుల్లో 200 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా ఈ ఘనతను సాధించిన వారిలో హర్భజన్ సింగ్ 46 మ్యాచులు, అనిల్ కుంబ్లే 47 మ్యాచులు, బీఎస్ చంద్రశేఖర్ 48 మ్యాచుల్లో రెండు వికెట్ల మైలురాయిని అందుకున్న వారిలో ముందు వరుసలో నిలిచారు.

 

Leave a Reply