ఎన్టీఆర్ ఎత్తుపల్లాల ప్రస్థానానికి పదిహేడేళ్ళు

Share Icons:

“నిన్ను చూడాలని“ సినిమాతో తన ప్రస్థానాన్ని ఆరంభించిన జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా చలన చిత్రసీమలోకి అడుగుపెట్టి నేటికి 17యేళ్ళు. దీనికంటే ముందే బాలనటుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలరామాయణంలో రాముడిగా నటించి మెప్పించాడు ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమా కంటే ముందు “బ్రహ్మర్షి విశ్వామిత్ర” అనే ధారావాహికలో నటించాడు తారక్.

హీరోగా తొలుత పరాజయాన్ని చవి చూసినా వెంటనే స్టూడెంట్ నెం1 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తర్వాత కొన్ని అపజయాలు ఎదురయ్యినా సింహాద్రి, ఆది, రాఖీ,యమదొంగ ,అదుర్స్, బృందావనం లాంటి హిట్ సినిమాలతో మాస్ లో తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు. తక్కువ వయసులో భారీ హిట్లు రావడంతో సినిమా అంటే ఇంతే కాబోలు అనుకున్నాడే కానీ కథలు ఎంచుకోవడంలో కొత్తదనం కనబరచలేదు. తర్వాత వచ్చిన దమ్ము,ఊసరవెల్లి,రామయ్యా వాస్తవయ్యా , రభస లాంటి చిత్రాలతో వరుసగా పరాజయాలు అందుకున్నాడు కానీ ఆ పరాజయాలేవీ తనకున్న ఫాలోయింగ్ ని ఆపలేకపోయాయి. సినిమాల్లోనే కాదు రాజకీయంగా, కుటుంబపరంగా కూడా సమస్యలు చుట్టుముట్టాయి. ఎన్ని పాట్లు వచ్చినా పడ్డాడు. కానీ ఓడిపోయానని చితించలేదు.

పరాజయాలన్నీ కలిసి మొట్టికాయ వేసినట్టు అనిపించింది. మూస కట్టు కథలకి వీడ్కోలు పలికి కథల ఎన్నికలో కొత్త పంధాని ఎంచుకున్నాడు. “టెంపర్” తో వచ్చి ఎన్టీఆర్ అంటే ఇది అని నిరూపించుకున్నాడు. ఇక తర్వాత వచ్చిన  నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో భారీ విజయాలని అందుకుని ఎన్టీఆర్ అంటే మాస్ మాత్రమే కాదు క్లాస్ కూడా అని నిరూపించుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల వచ్చిన “జై లవ కుశ” చిత్రం ఒక ఎత్తు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేసి మూడు పాత్రలలోనూ జీవించేశాడు. ఎన్టీఆర్ అనే పేరుకి ఉన్న ఖ్యాతిని మరింత రెట్టింపు చేసింది. ఈ సినిమాకి ఎన్టీఆర్ కి వచ్చిన స్పందన గతంలో తనకెప్పుడూ రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా క్లాస్ గా చేస్తే ఒక సినిమా మాస్ గా చేశాడు, కానీ ఈ సినిమాలో క్లాస్ మాస్ అన్నీ కలిపి కొట్టి “ఇంక ఎన్టీఆర్ కి నటనలో తిరుగులేదు” అనేలా చేశాడు. ఈ 17యేళ్ళ ప్రస్థానంలో అన్ని ఎత్తుపల్లాలను చూశాడు కాబట్టే ఎన్టీఆర్ ఇప్పుడు నెంబర్1 రేస్ లో ముందు వరుసలో ఉన్నాడు.

సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉన్నందుకే ఎన్టీఆర్ ఇప్పుడు నెంబర్1 రేస్ లో ఉన్నాడా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే తనలో ఉన్న నటన,నాట్యం, వాక్చాతుర్యం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, అందరూ నా వాళ్ళే అనుకునే తత్వం అతన్ని “జూనియర్ ఎన్టీఆర్” అనే స్థాయి నుండి “జై ఎన్టీఆర్” అనే స్థాయికి తీసుకువచ్చాయి.

 

 

2 Comments on “ఎన్టీఆర్ ఎత్తుపల్లాల ప్రస్థానానికి పదిహేడేళ్ళు”

  1. Pingback: WOW Blog

Leave a Reply