హ్యాట్సాఫ్ జగన్.. ఏపీ సీఎంపై పూరి జగన్నాథ్ ప్రశంసలు

Share Icons:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వర్షం కురిపిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో 104, 108 సర్వీసుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జగన్‌ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ట్విట్టర్ వేదికగా హ్యాట్పాఫ్ జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా అంతా కరోనా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, విపత్తులు మరియు తీవ్రమైన అమరికల కోసం AP లోని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ‘108,104’ అంబులెన్స్‌ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన జగన్ గారికి అభినందనలు అంటూ పూరి ట్వీట్ చేశారు.

ఏపీలో మరో గొప్ప కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో మరో అడుగు ముందుకు వేశారు జగన్. ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించిన సీఎం.. ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను బుధవారం ఉదయం 9.35 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి జగన్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమం అనంతరం వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 108, 104 సర్వీసులను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేయగా, ఇప్పుడు సీఎం జగన్‌ వాటికి అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.