హైదరాబాద్ వరద బాధితులకు అండగా బాలకృష్ణ.. రూ.1.5 కోట్ల విరాళం!

Share Icons:
భారీ వర్షాలు, వరదలు భాగ్యనగరం హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవడంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా పాతనగరం అల్లకల్లోలంగా మారింది. నాలాలు పొంగి పొర్లడం, చెరువులకు గండ్లు పడటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిండీతిప్పలు లేక అవస్థలు పడుతున్నారు. ఇక ఎంతో మంది పేదలు నివాసాలు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో గడుపుతున్నారు. వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే, హైదరాబాద్ వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ విరాళాలు ప్రకటించలేదు. అయితే, నటసింహా నందమూరి రూ. 1.5 కోట్ల విరాళం ప్రకటించారని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై బాలకృష్ణ వైపు నుంచి కానీ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అలా అని ఏ స్వచ్ఛంద సంస్థ కూడా ప్రకటించలేదు.

కానీ, బాలయ్య భారీ విరాళాన్ని ప్రకటించారని సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు. బాలయ్య మనసు బంగారం అని అంటున్నారు. అంతేకాదు, బసవ తారకరామ సేవా సమితి ద్వారా పాతబస్తీలోని 1000 కుటుంబాలకు ఆహార పొట్లాలను కూడా అందజేస్తున్నారని చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం వారికి ఈ ఆహార పొట్లాలను అందజేశారట. ఇదిలా ఉంటే, బాలయ్య కరోనా టైమ్‌లోనూ పేద ప్రజలను, సినీ కార్మికులను ఆదుకున్నారు. రూ1.25 కోట్లు విరాళం ఇచ్చారు.