హిట్టింగ్ సౌండ్.. ఓపెనర్ శిఖర్ ధావన్ ఈజ్ బ్యాక్

Share Icons:
టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన శిఖర్ ధావన్ అప్పటి నుంచి క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు. మధ్యలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లభించిన బ్రేక్ కూడా అతనికి లాభించింది. భుజం గాయం నుంచి గబ్బర్ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించేందుకు అది ఉపయోగపడింది. తాజాగా సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ జరిగేలా స్పష్టమైన షెడ్యూల్ వెలువడటంతో.. శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు.

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌కి ఆడిన శిఖర్ ధావన్.. 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 521 పరుగులు చేసి టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. దాంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ అదే జోరుని కొనసాగించి టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని గబ్బర్ ఆశిస్తున్నాడు. గాయం కారణంగా టీమ్ నుంచి ధావన్ తప్పుకోవడంతో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న నేపథ్యంలో.. ధావన్ ఫామ్ నిరూపించుకుని ఆ టూర్‌కి ఎంపికవ్వాలని ఆశిస్తున్నాడు.

అవుట్ డోర్‌లో అదీ ఫ్లడ్ లైట్ల వెలుగులో తాజాగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేసిన శిఖర్ ధావన్.. ‘బంతిని బ్యాట్ తాకినప్పుడు వచ్చే సౌండ్‌ని లవ్ చేస్తా.. ఈ హిట్టింగ్ తీవ్రతని (ఐపీఎల్‌లోనూ) ఇలానే కొనసాగిస్తా’’ అని రాసుకొచ్చాడు. ఆ ప్రాక్టీస్ సెషన్‌లో రివర్స్ స్వీప్ షాట్లని కూడా అలవోకగా ఆడేసిన గబ్బర్.. తాను భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అభిమానులకి చెప్పకనే చెప్పాడు. మరి ఐపీఎల్‌లోనూ ఇదే జోరుని గబ్బర్ కొనసాగిస్తాడేమో..? చూడాలి.