సెహ్వాగ్‌కి అరుదైన గౌరవం.. సెలక్షన్ ఫ్యానల్‌లో చోటు

Share Icons:
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కి అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ ఎంపిక కోసం తాజాగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సెలక్షన్ ఫ్యానల్‌లో సెహ్వాగ్‌కి చోటు దక్కింది. మొత్తం 12 మందితో కూడిన ఫ్యానల్‌‌లో సెహ్వాగ్‌‌తో పాటు హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, 2016 రియో పారాలింపిక్ రజత పతక విజేత దీపా మాలిక్ తదితరులకి అందులో చోటు లభించింది.

భారత్ తరఫున సత్తాచాటిన అథ్లెట్స్, కోచ్‌‌లకి ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్‌‌ని అందజేయనుండగా.. గత ఏడాది తరహాలోనే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఒకే ఒక ఫ్యానల్‌ని ఏర్పాటు చేసింది. ఈసారి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ముకుందకం శర్మ ఈ ఫ్యానల్‌కి ఛైర్మన్‌కాగా.. వివాదాలకి తావు లేకుండా పారదర్శకంగా ఉండేందుకే ఒకే ఫ్యానల్‌ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫ్యానల్.. రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, ద్రోణాచార్య అవార్డ్స్, అర్జున అవార్డ్స్, ధ్యాన్‌చంద్ అవార్డ్స్ తదితర పురస్కారాల కోసం అథ్లెట్స్, కోచ్‌లను ఎంపిక చేయనుంది.

వాస్తవానికి ఏటా హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులని అథ్లెట్స్‌, కోచ్‌లకి అందజేస్తారు. కానీ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఈ ఏడాది ఈ కార్యక్రమం జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆగస్టు 29 నాటికి పరిస్థితులు అదుపులోకిరాకపోతే.. సెప్టెంబరు లేదా అక్టోబరులో ఆ అవార్డు ప్రదానోత్సం జరిగే అవకాశం ఉంది.