సూపర్ ఓవర్‌లో ఓడిన హైదరాబాద్.. కోల్‌కతా‌ని గెలిపించిన ఫెర్గూసన్

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో చేతిలోకి వచ్చిన మ్యాచ్‌ని సూపర్ ఓవర్‌ వరకూ తీసుకెళ్లి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (47 నాటౌట్: 33 బంతుల్లో 5×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో.. 164 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన హైదరబాద్ 20 ఓవర్లలో సరిగ్గా 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. దాంతో.. స్కోర్లు సమమవగా.. సూపర్ ఓవర్‌ని నిర్వహించారు. అయితే.. ఈ సూపర్ ఓవర్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌.. కోల్‌కతా ఫాస్ట్ బౌలర్ ఫెర్గూసన్ దెబ్బకి తొలి మూడు బంతులకి డేవిడ్ వార్నర్, అబ్దుల్ సమద్ వికెట్లు చేజార్చుకుని రెండు పరుగులే చేసింది. దాంతో.. 3 పరుగుల ఛేదనకి దిగిన కోల్‌కతా వికెట్ చేజార్చుకోకుండా నాలుగో బంతికే విజయాన్ని అందుకుంది. సూపర్ ఓవర్‌లో రషీద్ బౌలింగ్ చేయగా.. దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ చాకచక్యంగా మ్యాచ్‌ని ఫినిష్ చేశారు. సీజన్‌లో 9వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్‌కి ఇది ఆరో ఓటమికాగా.. కోల్‌కతాకి ఐదో గెలుపు.

164 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (36: 28 బంతుల్లో 7×4), కేన్ విలియమ్సన్ (29: 19 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడేయగా.. అనంతరం వచ్చిన ప్రియమ్ గార్గె (4), మనీశ్ పాండే (6), విజయ్ శంకర్ (7) నిరాశపరిచారు. అయినప్పటికీ.. అబ్దుల్ సమద్ (23: 15 బంతుల్లో 2×4, 1×6)‌తో కలిసి సన్‌రైజర్స్ స్కోరు బోర్డుని నడిపించిన వార్నర్.. చివరి ఓవర్‌లో విజయానికి 18 పరుగులు అవసరమైన దశలో వరుస బౌండరీలు బాదేశాడు. రసెల్ వేసిన ఆఖరి ఓవర్‌లో వార్నర్ మూడు ఫోర్లు బాదగా.. ఒక నోబాల్, ఫ్రీ హిట్ కూడా వచ్చింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో వార్నర్ సింగిల్ తీయడంతో మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కి వెళ్లింది. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్ (3/15) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకోగా.. కమిన్స్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.

మ్యాచ్‌లో అంతకముందు ఓపెనర్ శుభమన్ గిల్ (36: 37 బంతుల్లో 5×4), ఇయాన్ మోర్గాన్ (34: 23 బంతుల్లో 3×4, 1×6), దినేశ్ కార్తీక్ (29 నాటౌట్: 14 బంతుల్లో 2×4, 2×6) నిలకడగా ఆడటంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. బసిల్ థంపీ, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.