‘సుశాంత్ ఫ్యూచర్ ప్లాన్లు ఇవీ.. జూన్ 29 నుంచి ఈ పనులు చేద్దామనుకున్నాడు’

Share Icons:
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ చనిపోవడానికి అతడి ప్రేయసి రియా చక్రవర్తే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలీవుడ్‌లో అతణ్ని ఎదగనీయకుండా కొందరు తొక్కేశారనే ప్రచారమూ జరుగుతోంది. కానీ చదువులో టాపర్, పని పట్ల నిబద్ధత ఉండి.. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ అనూహ్యం అందర్నీ వదిలి వెళ్లడంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు.

సుశాంత్ మరణం, ఆపై పరిణామాలు సుప్రీం కోర్టుకు చేరాయి. రియాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆమెను సుశాంత్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్‌ ప్లాన్స్ గురించి అతడి సోదరి ఓ విజన్ బోర్డును షేర్ చేసింది. జూన్ 29 నుంచి తాను చేయాలనుకున్న పనుల వివరాలను సుశాంత్ వైట్ బోర్డు మీద మార్కర్‌తో రాసి పెట్టుకున్న వివరాలను ఆమె అభిమానులతో పంచుకుంది.

‘‘త్వరగా నిద్రలేవాలి.. పుస్తకాలు చదవాలి, గిటార్ నేర్చుకోవాలి.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూడాలి.. జూన్ 29 నుంచి రోజూ వర్కౌట్లు (కసరత్తులు) చేయాలి, ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ చేయాలి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..’’ అంటూ తను చేయాలనుకున్న పనుల వివరాలను సుశాంత్ రాసుకొచ్చాడు. సుశాంత్ ప్లానింగ్‌లో ఎంతో ముందున్నాడు.. అతడికి న్యాయం చేకూరాలి అని శుక్రవారం రాత్రి శ్వేత సింగ్ కీర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోకు గంట వ్యవధిలోనే 56 వేల లైకులు వచ్చాయి. సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.