సుశాంత్ ఆత్మహత్యపై షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

Share Icons:
బాలీవుడ్ యంగ్ హీరో ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో నెపోటిజంపై విమర్శల దుమారం రేగింది. గతనెల 14వ తేదీన సుశాంత్ బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మరణాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం బాధాకరంగా ఉందని చాలామంది ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా పాకిస్తాన్ పేసర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సుశాంత్ మృతిపై స్పందించాడు.

సుశాంత్ మరణ వార్త తనను షాక్‌కు గురి చేసిందన్నాడు. మృతి చెందిన వార్త విన్నాక నన్ను ఓ విషయం చాలా బాధపడేలా చేసిందన్నాడు షోయబ్. అప్పట్లో సుశాంత్‌ని ఒకసారి ముంబైలో కలిసానని షోయబ్ గుర్తు చేశాడు. చాలా పొడుగాటి జుట్టుతో ఉన్నాడన్నాడు. ఆ సమయంలో సుశాంత్ ఎంఎస్ ధోని సినిమాలో నటిస్తున్నాడని కొందరు తనకు చెప్పారన్నారు. అప్పుడు నేను సుశాంత్‌తో మాట్లాడకుండా వెళ్లిపోయానని షోయబ్ అన్నారు. మాట్లాడిఉంటే అనేక సమస్యలపై అతనితో చర్చించే వాడినన్నాడు.తన జీవితానికి సంబంధించిన విషయాన్ని కూడా అతనితో పంచుకునేవాడినన్నారు. సమస్యలని ఎలా ఎదుర్కోవాలనే ధైర్యం అతనికి వచ్చేదన్నారు. ఆ రోజు మాట్లాడనుందుకు ఈ రోజు చాలా బాధపడుతున్నాను అని షోయబ్ పేర్కొన్నారు.

సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి.. కానీ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్నవారితో పంచుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందన్నారు షోయబ్ అక్తర్. హీరోయిన్‌ దీపిక పదుకొనే కూడా డిప్రెషన్‌, యాంగ్జైటీతో బాధపడేదని, కానీ ఆ విషయాన్ని అందరికి చెప్పి బయట పడిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుశాంత్‌ కూడా అలానే చేసి ఉండి ఉండే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదోమో అని అక్తర్ తన బాధని వ్యక్తం చేశారు.