‘సర్కారు వారి పాట’లో విద్యా బాలన్.. కీలక పాత్ర!

Share Icons:
‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత సూపర్ స్టార్ చేస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గీత గోవిందం’ తరవాత పరశురామ్ చేస్తోన్న చిత్రం కావడంతో ‘సర్కారు వారి పాట’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరో వైపు ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను మహేష్ బాబు కచ్చితంగా కొనసాగిస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నటశేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంది. టైటిల్, పోస్టర్ అద్భుతంగా ఉన్నాయని సినీ ప్రియులు కొనియాడారు. అలాగే, మోషన్ పోస్టర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం నటీనటులను ఎంపిక చేయడంలో బిజీగా ఉంది. తాజాగా ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ‘సర్కారు వారి పాట’లో నటించనున్నారు.

Also Read:

మహేష్ బాబు అక్కగా విద్యా బాలన్ నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే విద్యాబాలన్‌కు పరశురామ్ కథ చెప్పారని.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. విద్యా బాలన్ ఇప్పటికే ‘యన్.టి.ఆర్’ చిత్రంలో కనిపించారు. బాలకృష్ణకు జోడీగా బసవతారకం పాత్రలో ఆమె నటించి మెప్పించారు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్ జీవించారని అంతా కొనియాడారు. ఇప్పుడు మహేష్‌కు అక్కగా విద్యా బాలన్ నటిస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ భాగమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేటి, వై. రవిశంకర్, గోపి ఆచంట, రామ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.