షూటింగ్‌లో గాయపడిన ఇలియానా.. రొమాంటిక్ సీన్ చేస్తుండగా గాయం!

Share Icons:
గోవా బ్యూటీ ఇలియానాకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ‘దేవదాస్’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన .. తొలి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసింది. ఆ వెంటనే మహేష్ బాబు సరసన ‘పోకిరి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక అక్కడి నుంచి వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించింది.

టాలీవుడ్‌లో బాగా రాణిస్తున్న సమయంలో ఇలియానాకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆమె ముంబైకి మకాం మార్చింది. కానీ, అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సుధీర్ఘ విరామం తరవాత ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాలీవుడ్‌లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఇదిలా ఉంటే, తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో ఇలియానా గాయపడింది. ఆమె అరచేతికి స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని ఇలియానా స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఒక ఫొటోలో తన చేతికి అయిన గాయం గురించి సరదాగా రాసుకొచ్చింది. ‘‘రొమాంటిక్ కామెడీ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గాయపడతారు?’’ అని పేర్కొంది. మరో ఫొటోలో తన చేతికి అయిన గాయాన్ని చూపించింది. అంతేకాదు, దానిపై ‘ఐ యామ్ ఫైన్’ అని రాసింది.

సాధారణంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజింగులు చేసేటప్పుడు నటీనటులు గాయపడుతూ ఉంటారు. కానీ, రొమాంటి కామెడీ సినిమాల్లో ఇలాంటివి ఉండవుగా. బహుశా రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు గాయపడిందేమో! మొత్తానికి ఈ పోస్ట్ వల్ల తాను చేస్తున్న సినిమాకు కాస్త ప్రచారం లభించింది. ఈ రొమాంటిక్ కామెడీ పేరు ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్‌లీ’. రణ్‌దీప్ హుడాతో కలిసి ఈ చిత్రంలో ఇలియానా నటిస్తోంది.

బల్వీందర్ సింగ్ జాంజ్వ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో నల్లగా ఉండే అమ్మాయిగా ఇలియానా కనిపించనుంది. హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మురికిగా, నల్లగా ఉండే అమ్మాయిల పట్ల ఈ సమాజం చూపించే పక్షపాతాన్ని చూపించబోతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇండియాలోని పలు చోట్ల ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు.

Also Read: