షార్జాలో చెలరేగిన చెన్నై టాప్ ఆర్డర్.. ఢిల్లీ టార్గెట్ 180

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జోరందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో షార్జా వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్.. డుప్లెసిస్ (58: 47 బంతుల్లో 6×4, 2×6), రవీంద్ర జడేజా (33 నాటౌట్: 13 బంతుల్లో 4×6) దూకుడుగా ఆడటంతో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్తేజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. కగిసో రబాడ, తుషార్ చెరొక వికెట్ తీశారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. డుప్లెసిస్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శామ్ కరన్ (0) తొలి ఓవర్‌లోనే డకౌటయ్యాడు. సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద నోర్తేజ్ చేతికి కరన్ చిక్కాడు. అనంతరం వచ్చిన షేన్ వాట్సన్ (36: 28 బంతుల్లో 6×4) గేర్ మార్చే ప్రయత్నంలో ఔటవగా.. అంబటి రాయుడు (45 నాటౌట్: 25 బంతుల్లో 1×4, 4×6) స్లాగ్ ఓవర్లో భారీ షాట్లు ఆడేశాడు. ధోనీ (3) ఔటయ్యే సమయానికి 16.3 ఓవర్లలో 129/4తో నిలిచిన చెన్నై టీమ్ ఆఖరికి 179 పరుగులు చేయగలిగిందంటే అది జడేజా హిట్టింగ్ చలవే. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో తుషార్‌కి ఒక సిక్స్ బాదిన జడేజా.. 18వ ఓవర్‌లో రబాడానీ వదల్లేదు. ఇక ఆఖరి ఓవర్‌ వేసిన నోర్తేజ్‌కి వరుసగా రెండు సిక్సర్లు బాదేశాడు. దాంతో.. చెన్నై ఊహించని స్కోరుని అందుకుంది. రాయుడు- జడేజా జోడీ కేవలం 21 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకోవడం విశేషం.