షార్జాలో ఆర్సీబీ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ 172

Share Icons:
ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ ఆర్డర్ మరోసారి సమష్టిగా రాణించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో షార్జా వేదికగా గురువారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (48: 39 బంతుల్లో 3×4), క్రిస్ మోరీస్ (25 నాటౌట్: 8 బంతుల్లో 1×4, 3×6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ, మురగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ జోర్దాన్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (20: 18 బంతుల్లో 2×4, 1×6), అరోన్ ఫించ్ (18: 12 బంతుల్లో 1×4, 1×6) తొలి వికెట్‌కి 4 ఓవర్లలోనే 38 పరుగుల భాగస్వామ్యంతో మెరుగైన ఆరంభం ఇచ్చారు. అయితే.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇద్దరూ ఔటైపోగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఇక డివిలియర్స్‌ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ (13: 14 బంతుల్లో 1×4) నిరాశపరచగా.. శివమ్ దూబే (23: 19 బంతుల్లో 2×6) రెండు భారీ షాట్లతో సరిపెట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కారణంగా.. ఆరో స్థానంలో.. అదీ 16వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ (2: 5 బంతుల్లో) అంచనాల్ని అందుకోలేక 17వ ఓవర్‌లో ఔటైవగా.. బంతి వ్యవధిలోనే కోహ్లీ కూడా వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో.. బెంగళూరు 17.5 ఓవర్లు ముగిసే సమయానికి 136/6తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది.

కానీ.. చివరి రెండు ఓవర్లలో క్రిస్‌ మోరీస్, ఇసుర ఉదాన (10 నాటౌట్: 5 బంతుల్లో 1×6) జోడీ ఆ టీమ్‌కి ఊహించని స్కోరుని అందించింది. 19వ ఓవర్‌ వేసిన క్రిస్ జోర్దాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన మోరీస్ 10 పరుగులు రాబట్టగా.. చివరి ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో మోరీస్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టేశాడు. ఇదే ఓవర్‌లో ఇసుర ఉదాన కూడా ఓ సిక్స్ బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. దాంతో.. బెంగళూరు 171 పరుగులు చేయగలిగింది.