విలియమ్సన్ కెప్టెన్సీపై వేటు..? న్యూజిలాండ్ కోచ్ క్లారిటీ

Share Icons:
న్యూజిలాండ్ కెప్టెన్సీ నుంచి కేన్ విలియమ్సన్‌ని తప్పిస్తున్నారని గత కొద్దిరోజుల నుంచి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ని 0-3 తేడాతో న్యూజిలాండ్ చేజార్చుకోగా.. ఆ జట్టు కోచ్ గ్యారీ, కెప్టెన్ విలియమ్సన్ మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. దాంతో.. విలియమ్సన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు గ్యారీ తెరవెనుక పావులు కదిపినట్లు వార్తలు వెలువడ్డాయి. విలియమ్సన్ స్థానంలో టామ్ లాథమ్‌కి పగ్గాలు అప్పగించబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ.. అవన్నీ ఒట్టి పుకార్లేనని తాజాగా గ్యారీ స్పష్టం చేశాడు.

‘‘కేన్ విలియమ్సన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇంకా చెప్పాలంటే న్యూజిలాండ్ క్రికెట్‌లో అలాంటి చర్చేమీ జరగలేదు. విలియమ్సన్ గొప్ప లీడర్.. అతను మరి కొంతకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఇక అభిప్రాయభేదాలు అంటారా..? టీమ్‌లోని వ్యక్తుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజం’’ అని గ్యారీ స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల్లోనూ ఏకంగా 200 పరుగుల తేడాతో కివీస్ ఓడిపోవడంతో కెప్టెన్సీపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే.. 2016లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విలియమ్సన్‌కి వివాదరహితుడిగా పేరుంది. అతడ్ని సహచరులే కాదు.. ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లు కూడా ఇష్టపడుతుంటారు. దానికి ఉదాహరణ.. కోహ్లీ గత దశాబ్దకాలంగా విలియమ్సన్‌తో కొనసాగిస్తున్న స్నేహమే.