విరాట్ కోహ్లీని సింహంతో పోల్చిన RCB.. ట్విట్టర్‌లో పేలుతున్న జోక్‌లు

Share Icons:
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై నడిచినన్ని ట్రోల్స్, జోక్‌లు మరే జట్టుపైనా ఉండవంటే అతిశయోక్తి కాదేమో..! ఆ జట్టు గెలిచినా.. ఓడినా.. ట్విట్టర్‌లో సెటైర్లు మాత్రం చాలా కామన్. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. వరల్డ్ లయన్ డే (ఆగస్టు 10) సందర్భంగా ఆర్సీబీ పెట్టిన ఓ పోస్ట్‌ ట్రోల్స్‌కి గురైంది.

విరాట్ కోహ్లీ, సింహం ఫొటోని పక్క పక్కన పెట్టిన ఆర్సీబీ.. ‘‘రెండింటి మధ్య తేడాని గుర్తించండి.. మేము కనిపెట్టలేకపోయాం’’ అని ట్వీట్ చేసింది. దాంతో.. ఆర్సీబీని ట్రోల్ చేసే అవకాశం దొరకడంతో నెటిజన్లు మీమ్స్‌తో తెగ నవ్వులు పూయిస్తున్నారు. ఆఖరికి ఫ్యాన్స్‌తో కలిసి ఆర్సీబీ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ కూడా ఆ ఫొటోపై జోక్‌ పేల్చాడు. ‘‘రెండింటి మధ్య తేడా ఏంటంటే..? ఫస్ట్ పిక్‌లోని సింహం బట్టలు వేసుకుంటుంది.. రెండో పిక్‌లోని సింహం బట్టలు వేసుకోదంతే..! అని అత్తారింటికి దారేది సినిమాలోని పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్‌ని అక్కడ అన్వయించాడు.

2008 నుంచి ఐపీఎల్ ప్రారంభమవగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ.. ఒక్కసారి కూడా బెంగళూరు టీమ్ టైటిల్‌ని గెలవలేకపోయింది. ప్రతి సీజన్‌లోనూ ఈసారి కప్ మనదే అంటూ బరిలోకి దిగడం.. ఆఖరికి ఉసూరమనిపించడం ఆర్సీబీకి అలవాటుగా మారిపోయింది. గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోతోంది. కానీ.. ఆ జట్టుపై అంచనాలు మాత్రం ఏటా రెట్టింపవుతూనే ఉన్నాయి. దానికి కారణం.. ఆర్సీబీ జట్టులో కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్ ఉండటమే..!