విండీస్‌ని లైట్ తీసుకుని.. బ్రాడ్‌పై వేటు వేశారా..?: హుస్సేన్

Share Icons:
వెస్టిండీస్‌ చేతిలో ఊహించని విధంగా పరాభవం చవిచూసిన ఇంగ్లాండ్ టీమ్‌పై క్రమంగా విమర్శలు పెరుగుతున్నాయి. సౌథాంప్టన్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలుపొందిన వెస్టిండీస్.. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యాన్ని అందుకుంది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌ మాంచెస్టర్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానుంది.

తొలి టెస్టుకి జో రూట్ దూరమగా.. అతని స్థానంలో టీమ్‌ని నడిపించిన బెన్‌స్టోక్స్ పేలవ నిర్ణయాలతో ఇంగ్లాండ్ ఓటమికి ప్రత్యక్షంగా కారణమయ్యాడు. అందులో మొదటిది వర్షం పడే సూచనలు కనిపిస్తున్నా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం.. ఇక రెండోది తుది జట్టు నుంచి సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ని తప్పించడం. ఆఖరిగా మ్యాచ్‌లో చివరి రోజు కీలకమైన బ్లాక్‌వుడ్ క్యాచ్‌ని స్లిప్‌‌లో బెన్‌స్టోక్స్ చేజార్చాడు. మొత్తంగా.. వెస్టిండీస్‌ని లైట్ తీసుకున్నందుకు ఇంగ్లాండ్ భారీగా మూల్యం చెల్లించుకుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ పరోక్షంగా అభిప్రాయపడ్డాడు.

‘‘ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో‌.. అదీ ఫస్ట్ టెస్టులో స్టువర్ట్ బ్రాడ్‌‌కి కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉంటుంది. నేను 100 శాతం ధీమాతో ఈ మాట చెప్తున్నా. మరి వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అతనికి ఎందుకు చోటివ్వలేదు..? బహుశా వెస్టిండీస్‌ని తక్కువ అంచనా వేసి.. లైట్ తీసుకున్నారా..? గతంలో వెస్టిండీస్‌ని ఇలానే తక్కువ అంచనా వేయడంతో ఇంగ్లాండ్‌ని వాళ్లు ఓడించారు’’ అని నాజర్ హుస్సేన్ గుర్తుచేశాడు.