లేడీ కానిస్టేబుల్‌తో క్రికెటర్ రవీంద్ర జడేజా గొడవ.. ఆఖర్లో ట్విస్ట్

Share Icons:
టీమిండియా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ వివాదంలో చిక్కుకున్నాడు. రాజ్‌కోట్‌లో సోమవారం రాత్రి ఓ లేడీ కానిస్టేబుల్‌తో జడేజా దురుసుగా ప్రవర్తించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య రవిబాతో కలిసి రాత్రి 9 గంటల సమయంలో రవీంద్ర జడేజా కారులో వెళ్తుండగా.. వాహన తనిఖీల్లో భాగంగా లేడీ కానిస్టేబుల్ సోనాల్ గోసాయ్.. జడేజా కారుని ఆపారు. దాంతో.. జడేజా కారుని నిలిపినప్పటికీ వారిద్దరి మధ్య ‘మాస్క్’ విషయంలో పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు.

రవీంద్ర జడేజా కారుని నిలపగానే అతని వద్దకి వెళ్లిన లేడీ కానిస్టేబుల్.. మాస్క్ ధరించనందుకు జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించిందట. కానీ.. రవీంద్ర జడేజా నిరాకరిస్తూ ఆమెతో వాగ్వాదానికి దిగడంతో.. కానిస్టేబుల్‌ వాహన పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ని చూపమని అడగడంతో భారత క్రికెటర్ సహనం కోల్పోయి రోడ్డుపైనే ఆమెతో గొడవపడినట్లు ఆమె సహచర పోలీసులు ఉన్నాతాధికారులకి సమాచారం అందించారు. మరోవైపు జడేజా కూడా.. తనతో కానిస్టేబుల్‌ అతిగా వ్యవహరించిందని పోలీసులకి సమాచారం అందించాడట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? జడేజాతో గొడవపడిన నిమిషాల వ్యవధిలోనే లేడీ కానిస్టేబుల్‌ ఒత్తిడి తట్టుకోలేక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

జడేజా, లేడీ కానిస్టేబుల్ మధ్య గొడవపై డీసీపీ మనోహర్‌సిన్హా మాట్లాడుతూ ‘‘జడేజా తనతో దురుసు ప్రవర్తించినట్లు లేడీ కానిస్టేబుల్.. ఆమె తనతో దురుసుగా వ్యవహరించినట్లు జడేజా ఆరోపిస్తున్నారు. కానీ.. ఇద్దరూ ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం.. డ్రైవింగ్ సమయంలో రవీంద్ర జడేజా మాస్క్ ధరించి ఉన్నాడు. కానీ.. అతని భార్య రవిబా ఆ టైమ్‌లో మాస్క్ ధరించి ఉందా..? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని వెల్లడించారు.