లీటరు పెట్రోల్‌ రూ.60.. మోదీ సర్కార్‌కు రాహుల్ సవాల్!

Share Icons:
మధ్యప్రదేశ్ రాజకీయాలు బాగా వేడెక్కాయి. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో అక్కడ కమల్‌నాథ్ సర్కారు ఐసీయూకు చేరింది. ఇక్కడ సింధియాకు మద్దుతుగా 20 మందికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. సామాన్య ప్రజలకు సంబంధించిన సమస్యను ఉఠింకిస్తూ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా పతనమైనా కూడా దేశీ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్‌ను ఇంకా అధిక ధరకే విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తీసుకొని రాహుల్ గాంధీ.. క్రూడ్ ధరలు 35 శాతం పడిపోయినా కూడా ఎందుకని లీటరు పెట్రోల్‌ను రూ.60 విక్రయించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Also Read:

‘ఎన్నికల్లో గెలుపొంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో మీరు బిజీగా ఉన్నారు. అందుకేనేమో గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 35 శాతం పతనమైన విషయాన్ని మీరు గమనించి ఉండకపోవచ్చు. దేశంలో లీటరు పెట్రోల్ ధరను రూ.60 కిందకు తగ్గించి క్రూడ్ ధరల తగ్గుదల ప్రయోజనాన్ని ప్రజలకు అందించగలరా? దీంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదు’ అన్ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Also Read:

ఇకపోతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెతుతున్నాయి. క్రూడ్ ధరలు తగ్గినా కూడా మోదీ సర్కార్ ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించడం లేదని సామాన్య జనాలు పేర్కొంటున్నారు. దేశీ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలపై ఆధారపడి మారుతూ ఉంటాయి.

ఇకపోతే దేశీ ఇంధన ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర రూ.74.72 వద్ద, డీజిల్ ధర రూ.68.60 వద్ద నిలకడగానే ఉన్నాయి. గత ఆరు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఈరోజు స్థిరంగా ఉండటం గమనార్హం.