రోహిత్ శర్మా డగౌట్‌లో ఏం చేస్తున్నావ్..? వెళ్లి బెడ్‌రెస్ట్ తీసుకో..!: సెహ్వాగ్ సెటైర్

Share Icons:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ గాయంపై వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఆస్ట్రేలియా టూర్‌కి 32 మందితో కూడిన జట్టుని భారత సెలక్టర్లు గత సోమవారం ప్రకటించగా.. గాయం కారణంగా రోహిత్ శర్మని సెలక్షన్‌కి పరిగణలోకి తీసుకోలేదు. కానీ.. సెలక్టర్లు టీమ్‌ని ప్రకటించిన గంట వ్యవధిలోనే ముంబయి ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. దాంతో.. తొడ కండరాల గాయంతో ఉన్న రోహిత్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ఎలా చేశాడు..? అతనికి నిజంగానే గాయమైందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ ఆడిన చివరి మూడు మ్యాచ్‌లకీ దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. స్టేడియానికి వచ్చి డగౌట్‌లో కూర్చుని మరీ సహచరుల్ని ప్రోత్సహించాడు. బెంగళూరుతో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ టాస్‌కి ముందు మైదానంలోకి వచ్చి తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్, కోచ్ మహేల జయవర్ధనెతోనూ అతను ఉత్సాహంగా మాట్లాడుతుండటం కనిపించింది. దాంతో.. గాయంతో ఉన్న రోహిత్ శర్మకి స్టేడియంలో ఏం పని..? బెడ్ రెస్ట్ తీసుకుని తొందరగా ఫిట్‌నెస్ సాధించడంపై శ్రద్ధ పెడితే బాగుంటుందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేశాడు. రోహిత్ శర్మ గాయాన్ని పరిశీలించిన వైద్యులు కనీసం 2-3 వారాలు రెస్ట్ అవసరమని సూచించినట్లు టీమిండియా ఫిజియో.. సెలక్టర్లకి సమర్పించిన రిపోర్ట్‌లో పొందుపరిచిన విషయం తెలిసిందే.

‘‘రోహిత్ శర్మ గాయంపై ఎలాంటి అప్‌డేట్ లేదు. అతని గాయంపై క్లారిటీ కోసం మీడియానే ప్రశ్నించాలి. తొలుత రోహిత్ శర్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. మరి అలాంటప్పుడు అతను స్టేడియంలో ఏం చేస్తున్నట్లు..? గత రెండు మ్యాచ్‌ల్లోనూ అతను టీమ్ డగౌట్‌లో కనిపించాడు. ఒకవేళ రోహిత్ శర్మకి ఆరోగ్యం బాగాలేకపోతే..? బెడ్‌రెస్ట్ తీసుకోవచ్చు కదా..? అలాకాకుండా స్టేడియానికి వచ్చాడంటే.. ఆరోగ్యం బాగాలేదనేది అబద్ధమని తేలిపోయింది’’అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.