రోహిత్ శర్మకి శిఖర్ ధావన్ టైమిస్తున్నాడు: ఇర్ఫాన్ పఠాన్

Share Icons:
భారత ఓపెనర్లు , శిఖర్ ధావన్ సక్సెస్ అవడానికి కారణం.. ఒకరి ఆటని మరొకరు అర్థం చేసుకోవడమేనని మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. 2013 నుంచి కలిసి ఆడుతున్న ఈ ఓపెనింగ్ జోడీ.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోనే బెస్ట్ జోడీ అని రికార్డులు చెప్తున్నాయి.

రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ జోడీ ఇప్పటి వరకూ 16 శతక భాగస్వామ్యాలు నెలకొల్పగా.. ఈ దశాబ్దకాలంలో ఇదే బెస్ట్. మొత్తంగా.. సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ జోడీ 21 శతకాలతో టాప్-1లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ ఆడమ్ గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ 16 శతకాలతో సంయుక్తంగా రోహిత్- ధావన్‌ జోడీతో కలిసి రెండో స్థానంలో ఉన్నారు.

రోహిత్- ధావన్ ఓపెనింగ్ జోడీపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ‘‘శిఖర్ ధావన్ చాలా స్వేచ్ఛగా ఆడేస్తాడని మనందరికీ తెలుసు. కానీ.. రోహిత్ శర్మ మాత్రం క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకుంటాడు. ఆ సమయంలో అతనిపై ఒత్తిడి పెరగకుండా ధావన్ బాధ్యత తీసుకుంటాడు. దాంతో.. రోహిత్ శర్మకి తగినంత టైమ్ లభిస్తుంది. క్రీజులోని క్రికెటర్లు.. ఒకరి ఆటని మరొకరు అర్థం చేసుకుంటేనే మెరుగైన భాగస్వామ్యాలు నమోదవుతాయి. మ్యాచ్ ఆరంభంలో ధావన్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపిస్తే.. స్పిన్నర్లు రంగప్రవేశం చేసేలోపు రోహిత్ శర్మ సెటిల్‌ అయిపోతాడు. ఈ జోడీ సక్సెస్‌కి కారణం ఒకరినొకరు అర్థం చేసుకోవడమే’’ అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.