రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక…కోన రఘుపతికే అవకాశం…

Share Icons:
అమరావతి, 17 జూన్:

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకుగాను నోటిఫికేషన్‌ విడుదలైంది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జూన్‌ 18వ తేదీన ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుందని స్పీకర్ స్పష్టం చేశారు.

కాగా.. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి పేరును సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు ఖరారు చేసిన విషయం విదితమే. ఇదిలా ఉంటే.. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చునని స్పీకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

స్పీకర్ ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది.

ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ….ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో తూర్పారబట్టారు. పకృతి సంపదను టీడీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదని గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు.

ఏనాడైనా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పగటిపూట 9 గంటల కరెంట్ ఇచ్చిందని, తన స్వార్ధం కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తోందని, గత ఐదేళ్లలో దౌర్భాగ్యమైన పాలనను ప్రజలు చూశారని కాకాణి గోవర్దన్‌రెడ్డి దుయ్యబట్టారు.

 

Leave a Reply