రామ్‌ మందిర్‌ని చూసేందుకు భారత్‌కి వస్తా: పాక్ క్రికెటర్ కనేరియా

Share Icons:
భారత్‌లో నిర్మితంకానున్న రామ్ మందిర్‌ని చూసేందుకు ఇక్కడికి రానున్నట్లు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల రామ్ మందిర్ నిర్మాణానికి భూమి పూజ జరగగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి శుభాకాంక్షలు తెలుపుతూ కనేరియా ట్వీట్ చేశాడు. పాకిస్థాన్ జట్టుకి ఆడిన రెండో హిందూ క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించిన కనేరియా.. గత ఏడాదికాలంగా క్రికెటేతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్నాడు.

రామ్ మందిర్‌ భూమి పూజపై అతను ట్వీట్ చేయడంతో ఓ వర్గం నుంచి అతనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో.. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా మాట్లాడుతూ ‘‘హిందువుగా రాముడ్ని నేను ఆరాధిస్తాను. చిన్నప్పటి నుంచే రాముడు అంటే నాకు ఇష్టం. ముఖ్యంగా.. అతను జీవించిన విధంగా నాకు ఆదర్శం. రామ్ మందిర్‌పై నేను చేసిన ట్వీట్.. ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. ఒకవేళ రాముడు కరుణిస్తే..? రామ్ మందిర్‌ని చూసేందుకు తప్పకుండా భారత్‌కి వెళ్తాను’’ అని కనేరియా వెల్లడించాడు.

పాకిస్థాన్ తరఫున 2000 నుంచి 2010 వరకూ మ్యాచ్‌లాడిన డ్యానిష్ కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. పదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌ల్లో పాక్‌ని గెలిపించిన కనేరియా.. హిందువు కారణంగా వివక్షకి గురైనట్లు ఇటీవల మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వెలుగులోకి తెచ్చాడు. అవును.. తాను వివక్షకి గురైనట్లు కనేరియా కూడా చెప్పడంతో.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు చాలా మంది కనేరియాపై విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఎందుకు నోరు విప్పలేదంటూ..? ప్రశ్నల వర్షం కురిపించారు.