రవితేజ ‘ఖిలాడి’ షురూ: అన్నయ్య మ్యూజిక్, తమ్ముడి మాటలు.. ఇక కుమ్ముడే!

Share Icons:
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ర‌మేష్ వ‌ర్మ దర్శకత్వంలో రూపొందిస్తోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఖిలాడి’. ఈ సినిమాను ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎ స్టూడియోస్ సంస్థ కార్యాలయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముహూర్తపు స‌న్నివేశానికి హీరో హ‌వీష్ క్లాప్ కొట్టగా, ఐ. శ్రీ‌నివాస‌రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఆదివారం ఉద‌య‌మే విడుద‌ల చేసిన ‘ఖిలాడి’ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. టోట‌ల్ బ్లాక్ డ్రస్‌లో త‌న‌దైన స్టైల్ డాన్స్ మూవ్‌తో ఈ పోస్టర్‌లో ర‌వితేజ ఆక‌ట్టుకుంటున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ డ‌బుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని స‌త్యనారాయ‌ణ కోనేరు నిర్మిస్తున్నారు. ఎ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హ‌వీష్ ప్రొడ‌క్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి డాక్టర్ జ‌యంతీలాల్ గ‌డ (పెన్‌) స‌మ‌ర్పకునిగా వ్యవ‌హ‌రిస్తున్నారు.

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌదరి నాయిక‌గా న‌టించే ఈ చిత్రంలో డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్‌గా ఎంపిక‌య్యారు. ఉన్నత స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ర‌మేష్ వ‌ర్మ ‘ఖిలాడి’ని తీర్చిదిద్దుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ‌ప్రసాద్‌, ‘లూసిఫ‌ర్’ ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌ సుజిత్ వాసుదేవ్‌, అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్లు రామ్‌-ల‌క్ష్మణ్ వంటి టెక్నీషియ‌న్లతో ఆయ‌న ప‌ర్‌ఫెక్ట్ టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు.

శ్రీ‌కాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోద‌రుడు సాగ‌ర్‌ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ‘రాక్షసుడు’ వంటి బ్లాక్‌బ‌స్టర్ మూవీతో త‌మ‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అని స‌త్యనారాయ‌ణ కోనేరు, ర‌మేష్ వ‌ర్మ నిరూపించారు. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో, ఉన్నత ప్రమాణాల‌తో తీసేందుకు రెడీ అవుతున్నారు. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.

Also Read: