మోహన్ బాబుకి బెదిరింపులు.. కారుతో ఇంట్లోకి దూసుకెళ్లి మరీ వార్నింగ్.. ఇది ఎవరి పని?

Share Icons:
సీనియర్ నటుడు ఇంటి వద్ద కలకలం రేగింది. నేటి (ఆగష్టు 01) రాత్రి హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఆయన ఇంట్లోకి ఓ కారు దూసుకుని వచ్చింది. అందులో కొంతమంది దుండగులు మోహన్ బాబు ఫ్యామిలీని తీవ్రంగా హెచ్చరించడంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లుగా సమాచారం. ఈ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ నలుగురు వ్యక్తులు కారుతో ఇంట్లోకి చొరబడి.. మిమ్మల్ని వదలం అంటూ హెచ్చరించడంతో పాటు అక్కడే హల్ చల్ చేశారు. మోహన్ బాబు ఇంటి వాచ్ మెన్ అప్రమత్తంగా లేని సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఇది ఆకతాయిల పనా.. లేక మోహన్ బాబు ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఫిల్మ్ నగర్ ఎంట్రన్స్‌లోనే ఉండే మోహన్ బాబు ఇంటికి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇంటికి పెద్ద గేట్ ఉండటమే కాకుండా సెక్యురిటీ సిబ్బంది కట్టుదిట్టంగానే ఉంటుంది. అయితే వచ్చిన వాళ్లు ఎవరు? ఎందుకు వచ్చారు? మోహన్ బాబు ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి తదితర విషయాలు తెలియాల్సి ఉంది. అయితే మోహన్‌బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత అవసరం, ఆ స్థాయి శత్రువులు ఎవరా అన్న చర్చ మొదలైంది.
ఆకతాయిలైనా కావాలనే ఇలా చేశారా లేక నిజంగానే మోహన్‌బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పూనుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.