మేమున్నాం.. బసవతారకం హాస్పిటల్ సిబ్బందికి బాలయ్య భరోసా

Share Icons:
ప్రపంచం కరోనా వైరస్‌తో పోరాడుతోంది. భారతదేశంలో ఈ వ్యాధి మరింత మందికి సోకకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటున్నాయి. ఇది భయంకరమైన అంటు వ్యాధి అని తెలిసినా ప్రజల ప్రాణాలు కాపడటం కోసం వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. దేశంలో 21 రోజులపాటు లాక్‌డౌన్ నడుస్తున్నా హాస్పిటల్స్‌లో వైద్యులు, నర్సులు రోగులకు సేవలందిస్తున్నారు. అలాంటి వైద్య సిబ్బందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయాన్ని నటసింహా నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ అయిన బాలకృష్ణ.. ఆ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు, మేనేజ్‌మెంట్‌కి ఒక లేఖ రాశారు. వైద్య సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని, వారికి అండగా హాస్పిటల్ ఉంటుందని భరోసా ఇచ్చారు.

‘‘ప్రస్తుతం మనం చూస్తున్న, ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇంతకు ముందెన్నడూ మనం చూడనివి, క్లిష్టమైనవి. ప్రపంచం వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ క్లిష్టమైన సమయంలో మనమందరం బాధ్యతాయుతమైన దేశ పౌరులుగా వ్యవహరించాలి. మన బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌‌లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఉద్యోగులు, మేనేజ్‌‌మెంట్‌.. క్యాన్సర్‌ రోగులకు అవిశ్రాంతంగా నాణ్యమైన, సురక్షితమైన సేవలను అందిస్తున్నారు.

ఇదే సమయంలో గత కొద్ది రోజులుగా భయంకరమైన కరోనా వైరస్‌ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్నా, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరంగా కరోనావైరస్‌ వ్యాప్తిపై పోరాడుతూ, నివారణకై మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ వైద్యో నారాయణో హరిః అన్న సూక్తిని నిజం చేస్తూ విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్న మీ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మనమందరం ఆరోగ్య సంరక్షణ సేవలతో అనుబంధం కలిగి అనుసంధానించబడినందున, అనుక్షణం అప్రమత్తులై ఉండి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సలహాలను పూర్తిస్థాయిలో అనుసరించాలి. కరోనా వైరస్‌ సోకకుండా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరిని నేను కోరుతున్నాను. దయచేసి మీరు సురక్షితంగా ఉంటూ, మీ ప్రియమైనవారు కూడా సురక్షితంగా ఉండటానికి సహాయపడండి.

మనమంతా ఒక పెద్ద కుటుంబం, మీరు చేస్తున్న ఈ సేవలు వెలకట్టలేనివి, ఈ సమయంలో నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఈ కరోనా మహమ్మారిపై పోరాటంలో దురదృష్టవశాత్తు మీలో ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు బయటపడినా, లేదా ఇకపై ఈ వ్యాధి బారిన పడినా, మీ చికిత్స కోసం ఆసుపత్రి అన్ని జాగ్రత్తలు, భాద్యత తీసుకుంటుంది. ప్రాణాంతకమైన ఈ కరోనా మహమ్మారిపై మీ పోరాటం, వ్యాధి కట్టడిలో అలుపెరగని మీ సేవలు, విధుల పట్ల మీరు చూపిస్తున్న నిబద్దతకు మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సురక్షితంగా ఉండండి, మీ అంతులేని ఆత్మస్తెర్యాన్ని కొనసాగించండి’’ అని లేఖలో బాలకృష్ణ పేర్కొన్నారు.