మేకింగ్ వీడియో: ఎన్టీఆర్ పాటకు జపనీస్ జంట డ్యాన్స్.. మూడో వ్యక్తి అవసరం లేకుండా షూట్..!

Share Icons:
జపాన్‌కు చెందిన ఓ జంట రెండు నెలల క్రితం ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచిన విషయం గుర్తుందా? ‘అశోక్’ సినిమాలోని ‘గోల గోల’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు. ఎన్టీఆర్, సమీరా రెడ్డి చేసినట్టుగానే పాటలు ఉన్న స్టెప్పులను దించేశారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు. ఆ తరవాత ‘సింహాద్రి’లోని ‘చీమ చీమ’ పాటకు కూడా ఈ జంట డ్యాన్స్ చేసింది.

ఇప్పుడు ఈ జపనీస్ జంట డ్యాన్స్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మళ్లీ ఎన్టీఆర్ సినిమాలోని పాటకే ఈ జపనీస్ జంట స్టెప్పులేసింది. కాకపోతే, ఈసారి కాస్త వెరైటీగా ఈ కవర్ సాంగ్‌ను చేశారు. ‘కంత్రి’ సినిమాలోని ‘వయస్సునామీ’ అంటూ సాగే పాటకు ఈ జపనీస్ జంట డ్యాన్స్ చేసింది. ఇంటిని శుభ్రం చేస్తున్నట్టుగా ఈ పాటను కొరియోగ్రఫీ చేశారు. ఆ పాటలో ఎన్టీఆర్, హన్సిక ఎలా అయితే డ్యాన్స్ చేశారో అలాగే ఈ జంట కూడా దించేశారు.

ఇంతకీ అతని పేరు హిరో మునీరు (). జపనీస్ కాస్ట్యూమ్ డిజైనర్, ఫొటోగ్రాఫర్. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఆయన తన ఛానెల్‌లో చాలా వీడియోలు పెడుతుంటారు. వాటిలో ఎన్టీఆర్ డ్యాన్స్ వీడియోలు కొన్ని. విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు ఈయన కేవలం ఎన్టీఆర్ పాటలకు మాత్రమే డ్యాన్స్ చేశారు. జపాన్‌లో ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ‘వయస్సునామి’ కవర్ సాంగ్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన హిరో.. ఈ పాట మేకింగ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ పాటను చేయడానికి తాము ఎంత కష్టపడ్డామో వెల్లడించారు. చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసింది ఈ జపనీస్ జంట.