మూడు రాజధానులపై మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యలు…

Share Icons:

రాజమండ్రి: ఏపీలో మూడు రాజధానులపై జరుగుతున్న రాజకీయంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడుంటే ఏంటి? అని చెబుతూనే,  మూడు రాజధానులపై ఏమీ చెప్పలేకపోతున్నానని మాట్లాడారు. అసెంబ్లీ ఒక చోట, సచివాలయం మరోచోట దేశంలో ఎక్కడా లేవన్నారు. అమరావతి రైతులది త్యాగం కాదని, రియల్ ఎస్టేట్‌ భాగస్వామ్యమని ఎప్పుడో చెప్పానన్నారు.

గత ప్రభుత్వం అగ్రిమెంట్‌ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తే ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. జగన్‌ రాజధాని కంటే పోలవరం, ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 2021 జూన్‌కు పోలవరం పూర్తయ్యేలా లేదని అన్నారు. లక్ష కోట్లు తిన్నాడని తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పినా ప్రజలు జగన్‌కే ఓటేశారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. మన దేశ జీడీపీ కన్నా బంగ్లాదేశ్ జీడీపీ అధికంగా ఉందని అన్నారు. మనం సాయం చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు మనకన్నా ఎక్కువ జీడీపీని సాధించిందన్నారు. మన్మోహన్ ప్రధాని అయిన తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడిందని, ఆ తర్వాత మళ్లీ నాశనమైందని చెప్పారు.

కేవలం హిందుత్వ, పాకిస్థాన్‌ ఎజెండాతో కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దట్లేదని ఉండవల్లి ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని కేంద్ర ప్రభుత్వానికి మెయిల్ పంపానని, తన మెయిల్‌ను వారు పట్టించుకుంటారో లేదోనని అన్నారు. తాము ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటారని అన్నారు. తాను కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు వెళ్లిన వాడినేనని, కొన్ని రోజులు వెళ్లి మానేశానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.

 

Leave a Reply