‘ముప్పావలా’తో నాకెలాంటి సంబంధం లేదు: పవన్ ఫ్యాన్స్‌కి వర్మ వివరణ

Share Icons:
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే ఒక సంచలనం. తెలుగులో ‘శివ’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీసి ఆ తరవాత బాలీవుడ్‌కి వెళ్లి గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈ మేధావి.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమా తీసినా సంచలనమే.. వివాదమే. ఇటీవల ఆయన సమర్పణలో వచ్చిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ఎంత వివాదం అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత వర్మ కాంపౌండ్ నుంచి ‘బ్యూటిఫుల్’ సినిమా వచ్చింది. కానీ, దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాగే, ‘ఎంటర్ ది డ్రాగన్ గర్ల్’ పరిస్థితి కూడా అంతే.

ఈ నేపథ్యంలో కచ్చితంగా వర్మ మరో వివాదాస్పద సినిమాను ప్రకటిస్తారనే భావనతో చాలా మంది ఉన్నారు. ఊహించినట్టుగానే నిన్న (జనవరి 16న) వర్మ ‘ముప్పావలా’ అనే సినిమాను ప్రకటించినట్టు ఆయన పేరుతో ట్వీట్ ఒకటి వైరల్ అయ్యింది. ఇది పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీస్తున్న సినిమా అని పోస్టర్ చూస్తేనే అర్థమైపోతుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో వర్మను బూతులు తిట్టడం మొదలుపెట్టారు. అయితే, ఈ ట్వీట్ తాను చేయలేదని వివరణ ఇచ్చారు వర్మ.

Also Read:

మార్ఫింగ్ చేసిన ఇమేజ్‌ను ఎవరో తన పేరుతో పోస్ట్ చేశారని, దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే తన ట్వీట్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. మొత్తం మీద మరో వివాదం తలెత్తకుండా వర్మ బాగానే బ్రేకులు వేశారు. కానీ, వర్మ చేసిన ట్వీట్ కింద కామెంట్ సెక్షన్‌లో పవన్, జగన్ ఫ్యాన్స్ యుద్ధం చేసుకుంటున్నారు. రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని జగన్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. ఇక పవన్ అభిమానులు జగన్ కేసుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ మధ్యలో కొంత మంది వర్మను తిడుతున్నారు.

See Photo Story: